బెల్టు షాపులతో ‘ముండ్లమూరు’ వర్ధిల్లుతోంది

ABN , First Publish Date - 2021-12-16T04:45:27+05:30 IST

ముండ్లమూరు మండలంలో ఊరూరా జోరుగా బెల్టు షాపులు నడుస్తున్నాయి.

బెల్టు షాపులతో ‘ముండ్లమూరు’ వర్ధిల్లుతోంది
పట్టుబడిన తెలంగాణ మద్యం(ఫైల్‌)

మొక్కుబడి తనిఖీలు  

మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ పోలీసులు 

పొరుగు రాష్ట్రాల నుంచి రోజువారీ దిగుమతి


ముండ్లమూరు, డిసెంబరు 15 : మండలంలో ఊరూరా జోరుగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ప్రతి గ్రామంలో పది నుంచి 20 వరకు షాపులున్నాయి. వీటి నిర్వాహకులకు మద్యం ప్రభుత్వ నిర్వహిస్తున్న షాపుల నుంచే వెళ్తోంది. క్వార్టర్‌కు ఐదు రూపాయలు అదనంగా ప్రభుత్వ షాపుల వద్ద తీసుకొని బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. వీరు డిమాండ్‌ను బట్టి అమ్ముతుండడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. బెల్టు షాపుల నిర్వాహకులే కాకుండా కొంత మంది మొబైల్‌ వ్యాపారం కూడా చేస్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో మద్యం పెట్టుకొని మందు బాబుల వద్దకు వెళ్లి సరఫరా చేయటం నిత్యం జరుగుతోంది. 


మండలంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. బెల్టు షాపుల నిర్వాహకులు ప్రభుత్వ షాపుల్లో క్వార్టర్‌ రూ.205కు కొనుగోలు చేసి నిర్వాహకులు రూ. 250 నుంచి రూ.300 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు కొందరు ఎక్సైజ్‌ పోలీసులతో మాట్లాడుకొని షాపులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఒక వేళ బెల్టు షాపుల నిర్వాహకులపై దాడులు చేయాలని ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తుంటే వెంటనే కింది స్థాయి సిబ్బంది బెల్టు షాపుల నిర్వాహకులు ఫోన్‌లకు మెసేజ్‌లు పెట్టి అప్రమత్తం చేస్తున్నారు.


వేములలో గతంలో రెండు బెల్టు షాపులు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 10 షాపులు నడుస్తున్నాయి. ఈదర, బొప్పూడివారిపాలెం, భీమవరం, పూరిమెట్ల, ఉమామహేశ్వర అగ్రహారం, పసుపుగల్లు, పెదఉల్లగల్లు, నూజెండ్లపల్లి, పోలవరం, శంకరాపురం తదితర గ్రామాల్లో డజన్లకు పైనే బెల్టు షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్టు షాపు నిర్వాహకుడు ఇంచుమించు రోజుకు 50 నుంచి వంద క్వార్టర్ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. సరాసరి రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు సంపాదిస్తున్నారు.


 ఏరులై పారుతున్న పొరుగు రాష్ట్రాల మద్యం  

గ్రామాల్లో ఉండే మద్యమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌ ప్రాంతాల నుంచి జోరుగా మండలానికి మద్యం సరఫరా అవుతోంది. ఇందులో మండలంలో ఉన్న వైసీపీ నాయకులూ ప్రధాన సూత్రధారులుగా మారి మద్యాన్ని తీసుకు వచ్చి గ్రామాల్లో బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రోజూ రెండు మూడు వ్యాన్లలో సరఫరా అవుతోంది. ముందుగా వారు ఎంచుకున్న ప్రాంతంలో లారీని ఉంచి బెల్టు షాపుల నిర్వాహకులకు ఫోన్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. వారు వెంటనే ద్విచక్ర వాహనాలపై వెళ్లి మద్యాన్ని తీసుకొని రావటం ఆనవాయితీ అయింది. 

Updated Date - 2021-12-16T04:45:27+05:30 IST