వైసీపీలో ఎంపీడీవో బదిలీ ఫైట్
ABN , First Publish Date - 2021-12-31T04:48:07+05:30 IST
ఒక మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) బదిలీ వ్యవహారం అధికార వైసీపీలో రచ్చకు దారితీసింది. చివరకు ఆ వ్యవహారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిల వద్దకు చేరింది. ఎంపీడీవోను బదిలీ చేయాలంటూ ఎమ్మెల్యే పట్టుబడుతుండగా, కుదరదంటూ ఎంపీపీ, ఆమె భర్త అయిన వైసీపీ నేత భీష్మించుకూర్చున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్య పోరు
స్వేచ్ఛ కావాలంటూ బాలినేని, సజ్జలను కలిసిన ఎంపీపీ భర్త
ఎమ్మెల్యే మాటకే ప్రాధాన్యమిచ్చిన మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్
అయినా బదిలీపై తొలగని అనిశ్చితి
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ఒక మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) బదిలీ వ్యవహారం అధికార వైసీపీలో రచ్చకు దారితీసింది. చివరకు ఆ వ్యవహారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిల వద్దకు చేరింది. ఎంపీడీవోను బదిలీ చేయాలంటూ ఎమ్మెల్యే పట్టుబడుతుండగా, కుదరదంటూ ఎంపీపీ, ఆమె భర్త అయిన వైసీపీ నేత భీష్మించుకూర్చున్నారు. దీంతో ఆ మం డలంలో ఎంపీడీవో బదిలీ వ్యవహారం అనిశ్చితి స్థితిలో పడిపోగా, అక్కడకు వెళ్లేందుకు కూడా మిగిలిన ఎంపీడీవోలు వెనకంజ వేస్తుండడం గమనార్హం. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలంలో ఈ పరిస్థితి నెలకొంది.
నాగులుప్పలపాడు మండలానికి ప్రస్తుత ఎంపీడీవోగా ఆనంద్‌సత్యపాల్ ఉన్నారు. ఈయన ఈవోఆర్డీగా ఉంటూ ఇన్‌చార్జి ఎంపీడీవో గా పనిచేస్తున్నారు. ఆయన్ను బదిలీ చేయాలని ఎమ్మెల్యే సుధాకర్‌బా బు కోరుతూ జడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మకు, ఇతర అధికారులకు సిఫార్సు చేశారు. ఆయన స్థానంలో తొలుత కొండపి ఎంపీడీవో శ్రీనివా్‌సను ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ యన ఆ ఉత్తర్వులు అందుకోకముందే వాటిని మార్చేసి మద్దిపాడు ఎంపీడీవో హనుమంతరావును ఇన్‌చార్జిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. మండలంలో ఎంపీపీ నలమలపు అంజమ్మ, ఆమె పక్షాన ఆమె భర్త వైసీపీ నేత కృష్ణారెడ్డి పరోక్షంగా పాలన చేస్తున్నారు. వారు ప్రస్తుత ఇన్‌చార్జి ఎంపీడీవో బదిలీని వ్యతిరేకించారు. బదిలీని ఆపేందుకు తొలుత కృష్ణారెడ్డి మండలంలోని కొంతమంది అనుచరులతో బాలినేనిని కలిసి ఆయన మద్దతు పొందే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే కొండపి ఎంపీడీవోను ఇన్‌చార్జిగా నియమించిన ఉత్తర్వులు రద్దు కావడానికి ఉన్నత స్థాయిలో కృష్ణారెడ్డికి లభించిన మద్దతే కారణమని ప్రచారం జరిగింది. తదనంతరం ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మంత్రి బాలినేని వద్దకెళ్లి పలు అంశాలను ప్రస్తావిం చి ఎంపీడీవో బదిలీ జరగాల్సిందేనని చెప్పినట్లు తెలిసింది. జడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ మాత్రం తొలుత ఇటు ఎమ్మెల్యే, అటు ఎంపీపీల్లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని వెనుకాడినప్పటికీ మంత్రి బాలినేని సూచనతో ఎమ్మెల్యే వైపే మొగ్గుచూపారు. తదనుగుణంగా మద్దిపాడు ఎంపీడీవో హనుమంతరావును నాగులుప్పలపాడు ఇన్‌చార్జి ఎంపీడీవోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని జడ్పీ సీఈవోకు సూ చించారు. ఆ మేరకు ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఇది తెలిసి కృష్ణారెడ్డి నియోజకవర్గంలో మరికొందరు అసమ్మతి నేతలతో కలిసి బుధవారం హుటాహుటిన అమరావతి వెళ్లి అటు సజ్జలను, ఇటు బాలినేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై కొన్ని ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. చివరకు మంత్రి బాలినేని ఎమ్మెల్యే సిఫార్సుకే ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీచైర్‌పర్సన్ వెంకాయమ్మ, ఆమె కుమారుడు శివప్రసాద్‌కు సూచించినట్లు తెలిసింది.
తాజా పరిస్థితి
గురువారం మద్దిపాడు ఎంపీడీవో ఇక్కడ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోపోగా, ప్రసుత్త ఎంపీడీవో విధుల్లో కొనసాగారు. కృష్ణారెడ్డి ఆయన్ను రిలీవ్ కావొద్దని చెప్పినట్లు తెలిసింది. వెళ్లి బాధ్యతలు తీసుకోవాలని మద్దిపాడు ఎంపీడీవోపై సీఈవో ఒత్తిడి చేస్తుండడం, ఎంపీపీ వైపు నుంచి ఆయనకు రావద్దని సమాచారం వెళ్లడం, ప్రస్తుత ఇన్‌చార్జి ఎంపీడీవో రిలీవ్‌కాకపోవడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. దీంతో మళ్లీ వ్యవహారం మంత్రుల దృష్టికి వెళ్లగా, ఉన్న అధికారిని తొలగించి కొత్త వారిని నియమించేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలన్న అంశంపై జడ్పీ చైర్‌పర్సన్, సీఈవోలు కుస్తీ పడుతున్నారు. కాగా ఈ అంతర్గత సమస్యకు మండల పరిషత్‌పాలనపై తన పట్టే ఉండాలని ఎంపీపీ, తన పాత్రే ముఖ్యమని ఎమ్మెల్యే భావించడమే అసలు కారణం అని తెలిసింది.