దారుణం: చిన్నారుల గొంతుకోసి

ABN , First Publish Date - 2021-05-18T06:20:55+05:30 IST

కన్నపేగు బంధాన్ని..

దారుణం: చిన్నారుల గొంతుకోసి
బాధితురాలితో మాట్లాడుతున్న బంధువు

అమ్మా ఎంత పనిచేశావ్‌!

ఇద్దరు పిల్లల గొంతుకోసి చంపేసిన తల్లి

తానూ ఆత్మహత్యాయత్నం 

ఉప్పలపాడులో దారుణం

కుటుంబ కలహాలే కారణమని అనుమానం

 

పొదిలి(ప్రకాశం): కన్నపేగు బంధాన్ని ఆ తల్లి మరిచిపోయింది. తనకు ఎంత కష్టమొచ్చిందో ఏమో గాని, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలను తన చేతులతోనే కడతేర్చడంతో పాటు అదే కత్తితో తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణం మండలంలోని ఉప్పలపాడులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అందిన సమాచారం మేరకు.. ఉప్పలపాడు గ్రామానికి చెందిన గుంటూరి రంగయ్య, కోటేశ్వరమ్మల చివరి కుమార్తె అయిన ఆదిలక్ష్మికి శింగరాయకొండకు చెందిన కరేటి శ్రీహరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి  ముఖేష్‌ (4), దిలీప్‌ (18నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.


అయితే అత్తవారింట్లో ఏం జరిగిందో ఏమోకాని ఆదిలక్ష్మి 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అందరితోనూ కలివిడిగా తిరిగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ి పల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. అనంతరం కత్తితో ఇద్దరి చిన్నారుల గొంతులు కోసింద. తానూ కూడా గొంతు కోసుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆదిలక్ష్మి అన్న వచ్చి తలుపులు తీసి చూసే సరికి ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. ఆదిలక్ష్మి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. అతను పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ప్రైవేటు వాహనంలో ఆదిలక్ష్మితోపాటు, ఇద్దరు చిన్నారులను ఒంగోలులోని రిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. 


ఉలిక్కిపడిన ఉప్పలపాడు

ఈ సంఘటనతో ఉలవపాడు ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు మగబిడ్డలతో ఆదిలక్ష్మి సంతోషంగా ఉన్నట్లు తాము భావించామని బంధువులు తెలిపారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వారు కన్నీరు పెట్టారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్రీరామ్‌ సందర్శించారు.  Updated Date - 2021-05-18T06:20:55+05:30 IST