కొలత.. కలత...!
ABN , First Publish Date - 2021-10-26T04:59:12+05:30 IST
వస్తువుల క్రయవిక్రయాలలో వ్యాపారులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తూనికలు, కొలతల్లో దగా చేస్తున్నారు. ఈ మోసంతోపాటు వస్తువుల్లో కల్తీ కూడా రాజ్యమేలుతోంది.

తూనికలు, కొలతల్లో మోసం
వస్తువుల క్రయవిక్రయాలలో దోపిడి
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ విక్రయాలలో అధికం
మరోవైపు కల్తీ బెంగ
మునిగిపోతున్న వినియోగదారుడు
గిద్దలూరు టౌన్, అక్టోబరు 25 : వస్తువుల క్రయవిక్రయాలలో వ్యాపారులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తూనికలు, కొలతల్లో దగా చేస్తున్నారు. ఈ మోసంతోపాటు వస్తువుల్లో కల్తీ కూడా రాజ్యమేలుతోంది. దీంతో వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వీటిని సమూలంగా నియంత్రించాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖలు మొద్దు నిద్రపోతున్నాయి. పండ్ల నుంచి కూరగాయల వరకు, సిమెంట్ నుంచి ఎరువుల వరకు, పెట్రోల్, డీజిల్ ఇలా ప్రతి వస్తువు విక్రయాలలో భారీగా మోసాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు కల్తీ, మరోవైపు మోసాలతో వినియోగదారులు అటు ఆర్థికంగా, ఇటు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు.
ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలలో భారీ మోసం జరుగుతోంది. కొన్ని పెట్రోలు బంకుల యజమానులు ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100 నుంచి 200 ఎంఎల్ వరకు పక్కదారి పట్టిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించాల్సి ఉన్నా ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు లేవు. వీటితోపాటు కొన్ని బంకుల్లో కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో అనేక బంకులలో కల్తీ జరుగుతున్నాయని, కొలతల్లో తేడాలు చేస్తున్నారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలే పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుంటే మరోవైపు బంకుల యజమానులు కొలతలతో మాయ చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో గాని సంబంధిత అధికారులు సోదాలు చేయడం లేదని, దాంతో యజమానులు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు అంటున్నారు. పెట్రోలు నాణ్యతను తెలుసుకునేందుకు బంకుల వద్ద పిల్లర్‌పేపర్ టెస్టు అందుబాటులో ఉండాలి. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోలు పోస్తే అది ఆవిరైపోతే నాణ్యతదిగా గుర్తించవచ్చు. అదే మరకలుగా మిగిలిపోతే కల్తీ జరిగినట్లు నిర్ధారించవచ్చు. ఈవిషయం చాలామంది వినియోగదారుకు తెలియదు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ దాదాపు రూ.112కు చేరింది. డీజిల్ రూ.100పైనే ఉంది. ఇదే సమయంలో కల్తీ, తూకాలలో తేడాలతో వినియోగదారులు కుదేలవుతున్నారు.
నిత్యవసరాలూ అంతే
నిత్యవసరాలు, ఇతర ఆహార పదార్థాలు, పండ్ల తూకాలలో మోసాల సంగతి చెప్పనక్కర లేదు. కిలోకు సుమారు 50 గ్రాముల వరకు తగ్గించి అమ్ముతున్నారు. కొన్ని సరుకులు ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు. చాలా షాపుల్లో రాళ్లనే తూనికలు గా నేటికీ వినియోగిస్తున్నారు. ఇక సాధారణ తూనిక రాళ్లపై ఎటువంటి ముద్రలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు చెప్పిందే వేదం. తూనికలు, కొలతల శాఖ అధికారులు తూతూమంత్రం తనిఖీలకే పరిమితం అవుతున్నారు. అదేమంటే సిబ్బంది కొరత పేరుతో మిన్నకుండిపోతున్నారు. ఈ తతంగం వెనుక పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నాయ న్న ఆరోపణలున్నాయి. పట్టణం లో పండ్లు, కూరగాయల వ్యాపారులు అత్యధిక శా తం తూనికల్లో మోసాల కు పాల్పడుతున్నారు. స్వీ ట్ల దూకాణాలలో వాటి త యారీ తేదీ ఉండాలన్న ని బంధన ఉన్నా ఎక్కడా ముద్రిస్తున్న దాఖలాలు లేవు. కల్తీ నియంత్రణ అధికారుల జాడే లేదు.
వంట గ్యాస్‌లో..
వంట గ్యాస్‌లో కూడా మోసం జరుగుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే ఇన్‌సెంటివ్ కాకుండా డెలివరీ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతోపాటు గ్యాస్ సిలిండర్లలోనూ మాయాజాలం నడుస్తోంది. కొన్ని చోట్ల చాకచక్యంగా సీల్ ఊడదీసి గ్యాస్‌ను తీసి మళ్లీ సీల్ పెట్టి వినియోగదారులకు అంటగడుతున్నట్లు సమాచారం. ఒక్కో సిలిండర్ కిలో వరకు తక్కువగా వస్తున్నాయి. ఇక డెలివరీ బాయ్స్ బాదుడు చెప్పనక్కర లేదు. ఒక్కో సిలిండర్‌పై సగటున బిల్లుతోపాటు అదనంగా 20 నుంచి 50 వరకు వినియోగదారుడు చెల్లించుకోవలసిందే.
ఇనుము, సిమెంటు
గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు చోటుచేసుకుంటున్నాయి. సిమెంటు బస్తాలో కిలో, కిలోన్నర తరుగు వస్తున్నది. కంపెనీల నిబంధనల సంగతి పక్కన పెడితే కొంతమంది దళారులు సిమెంట్ తీసి రీప్యాకింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇనుము కిలోల చొప్పున విక్రయించాల్సి ఉన్నా చాలామంది విడిగా అమ్ముతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణం సాగుతోంది. జగనన్న కాలనీలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి సిమెంటు, ఇనుము ఎక్కువ అవసరం. నిత్యం లక్షలాది రూపాయల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అదే అదునుగా వ్యాపారులు తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారు.