‘మమ’ అనిపించారు..!

ABN , First Publish Date - 2021-10-31T07:28:07+05:30 IST

నగర పంచాయతీ అభివృద్ధిలో తీసుకోవాల్సిన ప్రణాళికపై జరిగే కౌన్సిల్‌ సమావేశం శనివారం పేలవంగా జరిగింది.

‘మమ’ అనిపించారు..!
ఎజెండా అంశాలను సమీక్షిస్తున్న గఫార్‌

కనిగిరి, అక్టోబరు 30: నగర పంచాయతీ అభివృద్ధిలో తీసుకోవాల్సిన ప్రణాళికపై జరిగే కౌన్సిల్‌ సమావేశం శనివారం పేలవంగా జరిగింది. 20 వార్డుల్లో మౌలిక వసతుల కల్పనపై ఏమాత్రం చర్చ జరగలేదు. దాదాపు ముప్పావుగంట పాటు 38 అంశాలను చదివి సమావేశం ముగించేశారు. 

‘అధ్యక్షా’ అనకుండానే వెనుతిరిగిన కౌన్సిలర్లు

ప్రస్తుత నగర పంచాయతీ కౌన్సిల్‌ సభ్యులు పాలనాపరమైన అంశాల్లో అధ్యక్షా... అని తమ వాణి వినిపించాలని ఆశించారు. అయితే సమావేశంలో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. నగరంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. సమావేశంలో ఆ చర్చే లేకుండా పోయింది. వర్షాలు ఉదృతంగా వచ్చినప్పుడు డ్రైనేజీలు నిండిపోయి రోడ్లపైకి నీరొచ్చి నివాసప్రాంతాల్లోకి వెళుతోంది. ముఖ్యంగా 13, 10, 17వ వార్డుల్లోని బోయపాలెం, పాతూరు, కాశీనాయన గుడి ప్రాంతాల్లో ప్రధానమైన భారీ డ్రైన్లు ఉన్నాయి.  వీటిపైనా మాట్లాడే నాధుడే లేడు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. రోడ్లపైకి వచ్చి తోపుడు బండ్ల వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. దీంతో పామూరు బస్టాండు కూడలిలో నిత్యం రద్ధీంగా ఉంటోంది. ఈ సమస్యపై చైర్మన్‌ ముక్తసరిగా మాట్లాడారు. భారీ వాహనాల మళ్లింపునకు బైపాస్‌ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇంటింటికి కుళాయి సంగతే లేదు ఆ దిశగా ఏ కౌన్సిలర్‌ స్పందించ లేదు. అదేవిధంగా శివారు కాలనీల్లో పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదు. వీధిలైట్లు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుపై సమావేశంలో పాల్గొన్న కోఆప్షన్‌ సభ్యుడు చింతం శ్రీను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై స్థానిక కౌన్సిలర్లు స్పందించలేదు. కరోనా థర్డ్‌వేవ్‌ దాడి ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ముందుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చే లేదు. నగరపంచాయతీ కౌన్సిలర్ల భర్తలు, బంధువులు సమావేశంలో పాల్గొనడానికి వచ్చినప్పటికీ, రాజకీయంగా వివాదస్పదం అవుతుందని బయటే ఉండిపోయారు.  కానీ అధికార పార్టీ నేత ఒకరు మాత్రం సమావేశంలో పాల్గొన్నాడు. దీనిపై సాటి కౌన్సిలర్లే గుస గుసలాడుకున్నారు. అయితే అభ్యంతరం తెలిపే ప్రతిపక్షం లేకపోవడంతో   సమావేశం చప్పగా సాగింది. సమావేశం జరిగే తీరును తెలుసుకునేందుకు తన అనుమతితోనే ఆ నేత పాల్గొన్నారని కమిషనర్‌ తెలపడం గమనార్హం. సమావేశంలో 38 అంశాలతో కూడిన అజెండాలోని 26వర్కులకు, 3కోట్లు రూపాయల వ్యయంతో ఖర్చుకు ఆమోదం తెలుపుతూ కౌన్సిల్‌ సభ్యులు చప్పట్లతో ఆమోదం తెలిపారు.

గత పాలకుల అఫ్పులతో  అభివృద్ధికి విఘాతం : చైర్మన్‌

గత ప్రభుత్వ పాలనలో పన్నుల రూపంలో వచ్చిన నగదును ఇష్టానుసారం దుర్వినియోగం చేసి మున్సిపాలిటీకి తీరని అప్పులు మిగిల్చారని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ ఆరోపించారు. శనివారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకులు నీటి సరఫరా పేరుతో నిధులు మింగేశారన్నారు. శాసనసభ్యులు బుర్రా మధుసూదన్‌యాదవ్‌ సహకారంతో  నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. గత పాలకులు చేసిన అప్పులు కట్టేందుకు వచ్చిన ఆదాయం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ఏమైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఇప్పటికే రూ.30 లక్షల ఖర్చుతో ఇంటింటికి చెత్త డబ్బాలను అందిచామన్నారు. జనవరి నుంచి చెత్త వాహనాలు వస్తున్నాయని, ఆయిల్‌ ఖర్చు లేకుండా బ్యాటరీ సాయంతో ఈ వాహనాలు నడుస్తాయన్నారు. వాటి చార్జింగ్‌ కోసం రూ.52 లక్షలతో గార్లపేట రోడ్డులో జీపీఎస్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్లు కాంట్రాక్టర్‌ ఖరారు చేసుకున్నారన్నారు. ఇంకా ప్రజావసరమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో నగరపంచాయతీ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, టీపీఎస్‌ శాంతి, మేనేజర్‌ లావణ్య, షీమా, సిబ్బంది, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T07:28:07+05:30 IST