మిర్చి రైతుకు నష్టాల ఘాటు..!

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

పశ్చిమ ప్రకాశంలో మిర్చి రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి లేదా అనావృష్టితో కుదేలవుతున్నారు.

మిర్చి రైతుకు నష్టాల ఘాటు..!
వర్షాలకు దెబ్బతిన్న మిర్చి

అతివృష్టితో తెగుళ్లు

ఎర్రగా మారుతున్న కాయలు

ఆందోళనలో సాగుదారులు

కంభం, డిసెంబరు 8 : పశ్చిమ ప్రకాశంలో మిర్చి రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి లేదా అనావృష్టితో కుదేలవుతున్నారు. ఈ ఏడాది అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో వేసిన మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. పూర్తిగా దిగుబడి తగ్గడమే కాక తెగుళ్లు వెంటాడుతున్నాయి. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంటలను సాగు చేస్తున్నా అతివృష్టితో దిగుబడి కోల్పోయామని, మిర్చి పంట పిందె దశలోనే పండువారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరపలో పసుపుపచ్చ పురుగు, లద్దెపురుగు, మిరపపూతకు తామరాకు పురుగు సోకిందన్నారు. ముఖ్యంగా చెట్ల ఆకులకు జెమి ని వైరస్‌ సోకి మొక్క పెరుగుదల ఆగిపోయిందన్నారు. ఈ ఏడాది మొదట కురిసిన వర్షానికి పంట దిగుబడి బాగా వచ్చి చేసిన అప్పులు తీరుతుందనుకున్నాము.  ఇ ప్పటికే ఎకరాకు రూ.60 నుంచి 70వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. 

అధిక వర్షంతో నష్టాలు

కంభం సబ్‌ డివిజన్‌లోని కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల్లో సూరేపల్లి, కందులాపురం, జంగంగుంట్ల, లింగోజీపల్లి, తురిమెళ్ల, యర్రబాలెం, లింగాపురం, నాగులవరం, మాగుటూరు, రంగాపురం, యా చవరం, చీమలేటిపల్లి, కొత్తూరు, అక్కపల్లి, కొత్తపేట, బసినేపల్లి, గలిజేరుగుళ్ల తదితర ప్రాంతాల లో మిర్చి అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. కంభం మండలంలో 520 హెక్టార్లు, అర్ధవీడు మండలంలో 2వేల హెక్టార్లు, బేస్తవారపేట మండలంలోని 2600 హెక్టార్లలో మిర్చి సాగు చేసినట్లు తెలిసింది. గత ఏడాది అంతంత  మా త్రంగా వచ్చిన పంటకు ధరలు లేక తెగుళ్లతో నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రస్తుతం పిందె దశలోనే కాయలు పండువారడంతో తినేవారు ఉండరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 కౌలు రైతుల స్థితి దారుణం

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అధిక వర్షాలతో పంట తెగుళ్లబారిన పడి దిగుబడి తగ్గింది. దీనికితోడు ధర కూడా తగ్గడంతో ఏమి చేయాలో తెలియక కౌలు రైతులు అల్లాడుతున్నారు. మిర్చి సాగు చేసి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 

తెగుళ్లతో ఎదుగుదల లేని పంట

2 ఎకరాలలో మిర్చి పంట వేశాను. భారీ వర్షాల కారణంగా పంట దిగుబడి లేదు. తెగుళ్లు సోకి పంట ఎదుగుదల ఆగిపోయింది. 2 ఎకరాలకు ఇప్పటికే రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు చేశాను. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

- రవితేజ, రైతు, కంభం

పంట నష్టం వివరాలు పంపాం 

కంభం సబ్‌ డివిజన్‌ పరిధిలోని సాగులో ఉన్న మిర్చి పంటలను పరిశీలించాం. వర్షాలకు మిర్చి పంట చాలావరకు దెబ్బతిన్నది. పంటకు వేరుకుళ్లు, కాలర్‌డార్క్‌ తెగుళ్లు సోకి చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాం.

- శ్వేత, ఉద్యానవన శాఖాధికారి, కంభం




Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST