కౌలు కష్టం

ABN , First Publish Date - 2021-12-30T07:14:40+05:30 IST

వ్యవ సాయం వ్యథసా యంగా మారింది. ప్రధానంగా కౌలురైతుల పరిస్థితి దారుణంగా తయారైంది.

కౌలు కష్టం
గత నెలలో కురిసిన వర్షానికి సంతమాగులూరు ప్రాంతంలో దెబ్బతిన్న మిర్చి (ఫైల్‌)

భారంగా మారిన వ్య వసాయం 

నానాటికీ తీవ్రమవుతున్న సమస్యలు

ఎక్కువగా నష్టపోయింది కౌలు రైతులే

సగంలోనే పైర్లను వదిలేస్తున్న వైనం

ప్రభుత్వ ప్రయోజనాలు నామమాత్రమే

10శాతం మందికీ అందని సీసీఆర్‌సీ కార్డులు

కొనసాగుతున్న  కౌలుదారుల ఆత్మహత్యలు

కౌలు రైతులకు కష్టాలు ఎక్కువయ్యాయి. సాగు కలిసిరావడం లేదు. నష్టాలు కళ్లెదుటే కనిపిస్తుం డటంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, అందని ప్రభుత్వ ప్రయోజనాలు, వీటికి తోడు వరుస ప్రకృతి వైపరీత్యాలు.. వెరసి జిల్లాలోని కౌలు రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. ఎటువంటి సాయం అందే పరిస్థితి లేదు. కనీసం సర్కారు ఆదుకుంటుందనే ఆశా చచ్చిపోయింది. ప్రభుత్వం కౌలుదారులకు ఇచ్చే ప్రతి ప్రయోజనానికి సీసీఆర్‌సీ కార్డుతో లింకు పెట్టడంతో వారి పరిస్థితి మరింత దీనంగా తయారైంది. అటు    భూ యజమాని సహకారం అంతంతమాత్రమే ఉంటోంది. పాలకులు సైతం చిన్నచూపు చూస్తుండటంతో కౌలుకు పొలాలు తీసుకుని సాగు చేయడం ఇక కష్టమేనని వారు వాపోతున్నారు. అనేక మంది కాడి దించేస్తున్నారు. 

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 29 : వ్యవ సాయం వ్యథసా యంగా మారింది.  ప్రధానంగా కౌలురైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నారు. వరుస ఎదురుదెబ్బలతో సాగు అంటే భయపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లావ్యాప్తంగా 50వేల మంది కౌలు రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. వారిలో ప్రధానంగా మిర్చి రైతులు భారీగా దెబ్బతిన్నారు. కొందరు లక్షల్లో పెట్టుబుడులు నష్టపోయారు. అయితే ఎటువంటి సాయం అందాలన్నా సీసీఆర్‌ కార్డులకు లింకు పెట్టారు. మొత్తంగా కార్డులున్న వారి సంఖ్య పరిమితమే. ప్రభుత్వం మాత్రం ఈక్రాప్‌లో నమోదు చేసుకుంటే కౌలు రైతుకైనా ఇన్‌పుట్‌ సబ్సిడీ పడుతుందని చెబుతోంది. కానీ గతంలో నివర్‌ తుఫాన్‌ నష్టపరిహారం విషయంలో కూడా కౌలుదారులకు రిక్తహస్తమే ఎదురైంది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జిల్లాలో లక్షన్నర మంది కౌలుదారులు

జిల్లాలో కౌలుదారుల సంఖ్య లక్షన్నర మంది దాకా ఉండొచ్చని అంచనా. వీరిలో సీసీ ఆర్‌సీ కార్డులు ఉన్నవారు 13వేల మంది మాత్రమే. అంటే పదిశాతం మందికి కూడా ప్రభుత్వం అందించే సీసీఆర్‌సీ కార్డు లేదు. యంత్రాంగం ఎన్ని అవగాహన కార్యక్రమా లు చేపట్టినా యజమానులు అపోహలు వీడకపోవడంతో కౌలుదారులకు కార్డు అందని ద్రాక్ష అయ్యింది.  ప్రభుత్వం నుంచి నయా పైసా ప్రయోజనం పొందకుండా కౌలు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కానీ ప్రకృతి ప్రతికూలత వారిని కుంగదీస్తోంది. 


ప్రకటనలతో సరి

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే అందించే బీమా, మద్దతు ధర అన్నింటికీ సీసీఆర్‌సీ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రకటనల్లో మాత్రం కార్డుతో సంబంధం లేకుండా ఈ క్రాప్‌లో నమోదుతో  అన్ని ప్రయోజనాలను కౌలుదారులకు వర్తింపజేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చేసరికి అన్నింటికీ సీసీఆర్‌సీ కార్డునే ప్రామాణికంగా యంత్రాంగం తీసుకొంటోంది.


రుణాలు సైతం అంతంతమాత్రమే..

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు సీజన్లలో కలిపి కేవలం ఆరువేల మంది కౌలురైతులకు మాత్రమే బ్యాంకు రుణాలు అందాయి. వీరిలో సీసీఆర్‌సీ కార్డులున్న వారు 2,900మంది మాత్రమే. కౌలురైతులకు అందించిన రుణాలు కూడా రూ.25కోట్లలోపే ఉండడం వారిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. బ్యాంకు రుణాలు అందక ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చి సేద్యం చేస్తున్నారు. మరోవైపు అకాలవర్షాలు కౌలు రైతాంగాన్ని మరింత ఊబిలోకి నెట్టివేస్తున్నాయి. 


ఏడాదిలో 30 మంది బలవన్మరణం

అటు ప్రకృతి ప్రతికూలత, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కౌలు రైతులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. వారంరోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడటం వారి దీనస్థితికి అద్దం పడుతోంది. ఈ వారంలో యద్దనపూడి మండలానికి చెందిన ఆనందరావు, సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన యువ కౌలురైతు అంకంశెట్టి హనుమంతరావు ఉసురు తీసుకున్నారు. మార్చిలో అద్దంకి మండలానికి చెందిన అంజయ్య బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల పుల్లలచెరువు మండలం మర్రివేములకు చెందిన అలకా గోవిందయ్య (32) అనే కౌలు రైతు ప్రాణం తీసుకున్నాడు. ఏప్రిల్‌ 23న తర్లుపాడు మండలం సీతానాగులవరానికి చెందిన దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా గడచిన సంవత్సరకాలంలో దాదాపు 30మంది ఉసురు తీసుకున్నా రనేది రైతుసంఘాల సమాచారం. అధికారికంగా నమోదు చేసే లెక్కల్లో ఇవేవీ పరిగణనలోకి రావడం లేదు. జిల్లాలోని కౌలురైతులను ఆదుకోవడానికి సమర్థవంత మైన కార్యాచరణ రూపొందిస్తేనే తాము ఒడ్డున పడతామని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తు న్నారు.  సీసీఆర్సీ కార్డులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పథకాలను వర్తింప జేయాలని వేడుకుంటున్నారు. 


Updated Date - 2021-12-30T07:14:40+05:30 IST