కరోనాతో కొడుకు బాధతో తండ్రి..

ABN , First Publish Date - 2021-05-19T05:08:40+05:30 IST

కరోనా ఆ ఇంట విషాదాన్ని నింపింది. కొవిడ్‌ బారినపడి కొడుకు మృతి చెందాడు. అది తట్టుకోలేక తండ్రి కూడా మృతి చెందిన సంఘటన అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో జరిగింది.

కరోనాతో కొడుకు బాధతో తండ్రి..
బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందిన మహబూబ్‌ బాషా, కరోనాతో మృతి చెందిన నవీన్‌కుమార్‌(ఫైల్‌)

ఇద్దరి మృతితో కుటుంబంలో విషాదం


కంభం (అర్థవీడు), మే 18 : కరోనా ఆ ఇంట విషాదాన్ని నింపింది. కొవిడ్‌ బారినపడి కొడుకు మృతి చెందాడు. అది తట్టుకోలేక తండ్రి కూడా మృతి చెందిన సంఘటన అర్ధవీడు మండలం రంగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గొట్టిముక్కల నవీన్‌కుమార్‌ (31) కరోనాతో మృతి చెందాడు. అతడి తండ్రి వెంకటేశ్వర్లు కొడుకు మృతిని జీర్ణించుకోలేక గుండె ఆగి మరణించాడు.  వివరాల్లోకి వెళితే రంగాపురం గ్రామానికి చెందిన నవీన్‌కుమార్‌ కంభం మండలం కందులాపురం పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ జర్నలిజంపై మక్కువతో బేస్తవారపేట మండలం ఉదయ్‌ టీవీ చానల్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో 20 రోజులక్రితం నవీన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేరాడు. క్రమేపీ కోలుకున్న నవీన్‌ మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాడు అనగా సోమవారం ఊపిరి ఆడడంలేదని డాక్టర్లకు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మార్కాపురం వెళ్లి నవీన్‌ దహన సంస్కారాలు అక్కడే చేశారు. కుమారుడు మృతిచెందాడని తండ్రి వెంకటేశ్వర్లు రోధించాడు. సోమవారం సాయంత్రం స్వగ్రామం వచ్చిన వెంకటేశ్వర్లు కుమారుడిని తలచుకుంటూ గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మాయదారి కరోనా తండ్రీకొడకులను పొట్టన పెట్టుకున్నదని గ్రామస్థులు విలపిస్తున్నారు. 


బ్లాక్‌ ఫంగస్‌తో టైలర్‌ మృతి

మార్కాపురం, మే 18 : బ్లాక్‌ ఫంగస్‌తో మార్కాపురం పట్టణానికి చెందిన ఓ టైలర్‌ మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో టైలరింగ్‌ దుకాణం నిర్వహిస్తున్న షేక్‌ మహబూబ్‌బాషాకు గతనెల 15న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. అనంతరం పది రోజులకు నెగెటివ్‌ ఫలితం వచ్చింది. కానీ ఈనెల 5న ముక్కుకు బ్లాక్‌ ఫంగస్‌ సోకి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు బాషాను ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వ్యాధి ఏమిటన్నది నిర్ధారణ కాలేదు. అనంతరం విజయవాడలోని మెట్రో వైద్యశాలకు వెళ్లగా  వైద్యులు బ్లాక్‌ ఫంగస్‌గా నిర్ధారించారు. కానీ  వైద్యం చేయలేమని తేల్చిచెప్పి మణిపాల్‌ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. దీంతో గత శనివారం మహబూబ్‌ బాషాను మణిపాల్‌ వైద్యశాలలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఆయన మృతికి మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-19T05:08:40+05:30 IST