మళ్లీ వైరస్ వణుకు
ABN , First Publish Date - 2021-03-22T05:04:02+05:30 IST
జిల్లాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. నానాటికీ విస్తృతమవుతున్న వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లు
రోజుకు 7 నుంచి 15 వరకూ నమోదు
99 యాక్టివ్ కేసులు
ఆందోళన చెందుతున్న ప్రజలు
వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
పరీక్షల సంఖ్య పెంపు
వ్యాక్సినేషన్ వేగవంతం
జిల్లాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. నానాటికీ విస్తృతమవుతున్న వైరస్ వణికిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రోజుకు 7 నుంచి 15 పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. అధికారికంగా పది రోజుల్లో 87 మంది వైరస్ బారినపడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందన్న అంచనాలను సైతం అధికారులు కొట్టిపారేయలేకపోతున్నారు. వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొవిడ్ కేంద్రాలను పునఃప్రారంభించాలన్న ఆలోచన చేస్తున్నారు.
ఒంగోలు (కలెక్టరేట్), మార్చి 21 : జిల్లాలో కొవిడ్ సెకం డ్ వేవ్ మొదలైంది. పది రోజుల నుంచి నిత్యం కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా 10 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఈనెల 11 నుంచి ఇప్పటి వరకూ 87 కేసులు నమోదయ్యాయి. అవి కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూడటం అందరినీ కలవరానికి గురి చేస్తోంది.
యంత్రాంగం అప్రమత్తం
వైరస్ మళ్లీ ఉనికిచాటుకుంటుండటంతో జిల్లా యం త్రాంగం అప్రమత్తమైంది. రెండ్రోజుల క్రితం కలెక్టర్ పోలా భాస్కర్ వైద్యారోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసులు నమోదయ్యే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని ఆదేశించారు. కరోనా మొదటి వేవ్‌లో కరోనా కట్టడికి పనిచేసిన అధికారులందరికీ ఈ విషయంపై కలెక్టర్ పలు సూచనలు చేయడంతో వారంతా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.
విస్తృతంగా టెస్టులు
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో జిల్లాలో అందుకు అనుగుణంగా కరోనా టెస్టులను వేగవంతం చేశారు. రోజుకు కనీసం 4నుంచి 6వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నట్లు సమాచారం. ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు ఆర్టీసీ బస్టాం డ్లు, రైల్వేస్టేషన్లలో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వేస్తున్న కరోనా టీకాలను రెట్టింపు చేయాలని నిర్ణయించారు.
గత ఏడాది కొవిడ్ కరాళనృత్యం
గత ఏడాది జిల్లాలో కొవిడ్ కరాళనృత్యం చేసింది. ఆ సంవత్సరం మా ర్చి 19న తొలి కేసు నమోదైంది. ఒం గోలు మంగమూరు రోడ్డులోని జడ్పీకాలనీ 3వ లైనుకు చెందిన 23 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిం ది. ఆ తర్వాత క్రమేపి కేసులు పెరిగాయి. ఒకేరోజు 2 వేల పాజిటివ్‌లు కూడా వెలుగు చూశాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గత ఏడాది మార్చి 18నుంచి 62,284 మంది కరో నా బారినపడ్డారు. వారిలో 61,613 మంది కోలుకోగా 582 మం ది మృత్యువాత పడ్డారు. గడిచిన రెండు, మూడు నెలల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన వివిధ రంగాలు మళ్లీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ సమయంలో సెకండ్ వేవ్ అందరిలోనూ అలజడి సృష్టిస్తోంది.
కొత్తగా పది పాజిటివ్‌లు
ఒంగోలు(కార్పొరేషన్), మార్చి 21 : జిల్లాలో కొత్తగా పది కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మర్రిపూడి, చీమకుర్తి, త్రిపురాంతకం, మార్టూరు, కురిచేడు, పెదచెర్లోపల్లి, కనిగిరి, కందుకూరుల్లో ఒక్కొక్కరికి, వేటపాలెంలో ఇద్దరికి వైరస్ ఉన్నట్లు వీఆర్‌డీఎల్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదివారం నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 99కి చేరింది. నగరంలోని కొప్పోలురోడ్‌లో ఉన్నఇందిరమ్మ కాలనీలో ఓ వ్యక్తికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో అతడిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక పారిశుధ్య పనులు చేయించారు.
లాక్‌డౌన్‌కు ఏడాది
గతసంవత్సరం మార్చి 22న జనతా కర్ప్యూ
నెలల తరబడి కొనసాగింపు
అన్ని రంగాలు అతలాకుతలం
నేటికీ కోలుకోని వైనం
మళ్లీ పెరుగుతున్న వైరస్ ఉధృతి
అప్రమత్తం కాకుంటే ముప్పే
ఒంగోలు, మార్చి 22(ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పాటించి సోమవారం నాటికి ఏడాది పూర్తవుతోంది. అలా ప్రారంభమైన లాక్‌డౌన్ కరోనా కేసులు ఉధృతితో దాదాపు రెండున్నర నెలలపాటు పూర్తిగా కొనసాగింది. దీనివలన వైర్‌సవ్యాప్తిని కట్టడి చేయడంతోపాటు అపారప్రాణనష్టం జరగనప్పటికీ వివిధ వర్గాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. వ్యాపార, వాణిజ్య, విద్య, ఇతరత్రా అన్ని రంగాలూ స్తంభించి లక్షలాది కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. అదేసమయంలో జిల్లాలో కరోనా కేసుల ఉధృతి భారీగా పెరిగింది. నిత్యం వందల సం ఖ్యలో పాజిటివ్ కేసు ల నమోదయ్యా యి. వందల సంఖ్యలోనే కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. పొరుగుప్రాంతాలకు పరుగులు తీసి లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం పొందాల్సిన పరిస్థితి వేలాది కుటుంబాలకు ఏర్పడింది. అలా ఒకవైపు వైరస్ సోకుండా జాగ్రత్తలు, సోకిన వారు వైద్యం కోసం అవస్థలు, లాక్‌డౌన్ అమలు, అన్‌లాక్ సమయంలో షరతులతో అన్ని వర్గాల వారు సతమతమయ్యారు. ఈ ఏ డాది జనవరి నుంచి కరోనా తీవ్రత తగ్గి ప్రజలు ఊ పిరిపీల్చుకొని ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యా రు. లాక్‌డౌన్‌కు ఏడాది పూర్తవుతున్న సమయం లో పక్షం నుంచి వైరస్ తీవ్రత జిల్లాలో పెరుగుతోంది. తిరిగి లాక్‌డౌన్ తప్పదన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది.