కానరాని కాలువలు..!

ABN , First Publish Date - 2021-07-08T06:12:39+05:30 IST

గ్రామాల్లో సీసీ రోడ్లపై మురుగు నీరు నిలిచి ఉంటోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని కాలువలు..!
కాలువ లేక ఉత్తర బజార్‌ సీసీ రోడ్డుపై నిలిచిన మురికి నీరు

రోడ్లపై నిలుస్తున్న మురుగు నీరు

ఇబ్బంది పడుతున్న స్థానికులు

త్రిపురాంతకం, జూలై 7: గ్రామాల్లో సీసీ రోడ్లపై మురుగు నీరు నిలిచి ఉంటోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి ఉంది. మురికి నీరు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. వర్షపు నీరు, ఆవాసాల్లోని మురికి నీరు మొత్తం డ్రైనేజీల నుంచి పలు ప్రాంతాలలో  వస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గు రవుతున్నారు. గతేడాది పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేసి కాలువల్లోని పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించినా ప్రస్తుతం మళ్లీ చెత్త పేరుకుపోయింది. గ్రామంలోని బ్రహ్మంగారికాలనీ, ఉత్తరపు బజారు, ఉప్పలగుట్ట వంటి ప్రాంతాల్లో అనేక వీధులకు సీసీరోడ్లు లేవు. పలుచోట్ల సుమారు 20 ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు పూర్తిగా దెబ్బతిని పాడైపోయాయి. ఏ ఒక్క వీధిలోనూ కాలువలు లేవు. చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలిచి రోడ్లన్నీ చెరువులను, కుంటలను తపిస్తున్నాయి. అంబేడ్కర్‌కాలనీలో కాలువల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో  రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. పాదచారులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్య సమస్యతోపాటు వ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  అధికారులు గ్రా మాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామ స్థులు కోరుతున్నారు.

సీసీ రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయాలి 

త్రిపురాంతకంలోనే అతి పెద్దదైన ఉత్తరపు బజారుకు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీరోడ్డు పాడైపోయింది. దీనికితోడు కాలువలు లేవు. దీంతో వర్షపునీరు, ఇళ్లలోని మురికి నీరు రోడ్డుపైకి చేరి నిలిచి ఉంటుంది. నడిచేందుకు కూడా వీలులేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీరోడ్లు, కాలువలను ఏర్పాటు చేయాలి.

- పెద్దపుడి అంజిరెడ్డి, త్రిపురాంతకం


Updated Date - 2021-07-08T06:12:39+05:30 IST