‘జగనన్న స్వచ్ఛ సంకల్ప’ దుస్థితి
ABN , First Publish Date - 2021-05-20T06:30:35+05:30 IST
గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. ఈపథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు.

పారిశుధ్య పనులకు నిధులు లేవు
సొంత డబ్బులతోనే కార్యక్రమాలు
పర్యవేక్షణతో సరిపెడుతున్న ప్రభుత్వం
ఆందోళన చెందుతున్న సర్పంచ్‌లు
గిద్దలూరు టౌన్, మే 19 : గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. ఈపథకాన్ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో కొందరు సర్పంచ్‌లు అప్పులు చేస్తుండగా, ఆర్థికంగా ఉన్న వారు సొంత నిధులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో పంచాయతీలలో ఉన్న నిధులు ఊడ్చేశారు. పన్నులు కూడా వసూలు కావడం లేదు. దీంతో కాసులకు కటకట తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ల సొంత డబ్బులతో పారిశుధ్య పనులు చేయిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాలలో కరోనా కేసులు నమోదవుతున్నా నిధులు లేక పారిశుధ్యంపై శ్రద్ధ చూపలేక పోతున్నారు. గత ఏడాది గ్రామంలో ఒక్క కరోనా కేసు నమోదైతే యంత్రాంగం మొత్తం తరలివచ్చి, శానిటేషన్ పనులు నిర్వహించారు. హైపోక్లోరైడ్‌ను వీధులు, ఇళ్లపై పిచికారీ చేయించారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయినా పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదు. అసలే వేసవి కాలం కావడంతో మంచినీటి సమస్య కూడా గ్రామీణులను వేధిస్తోంది. మంచినీరు లేక, పారిశుధ్య చర్యలు లేక గ్రామాలు కంపుకొడుతున్నాయి. అయినా యంత్రాంగం దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకం నినాదానికే పరిమిత మైందని కొందరు విమర్శిస్తున్నారు.
పిచికారీకి పైసా విదల్చక
గ్రామీణ ప్రాంతాలలో మురికి కాలువలు శుభ్రపరచడం, దోమల నివారణకు హైపోక్లోరైడ్ పిచికారీ చేయడానికి ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చడం లేదు. పైగా సర్పంచ్‌లకు ఇప్పటి వరకు చెక్ పవర్ సైతం ఇవ్వలేదు. నిధులు వెచ్చించుకునే అధికారాలను కూడా కట్టబెట్టలేదు. సీఎస్‌ఎంఎస్ కోడ్ రూపొందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నదని సర్పంచ్‌లు వాపోతున్నారు. దీంతో కొందరు సర్పం చ్‌లు తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
మేజర్ పంచాయతీల్లోనూ
మేజర్ పంచాయతీల్లో మాత్రమే సూపర్ శానిటైజర్ పనులు సవ్యంగా సాగుతున్నాయి. కాస్త ఆర్థిక స్థోమత ఉండడంతో ట్రాక్టర్లను వినియోగించి పనులు నిర్వహిస్తున్నారు. మిగిలిన పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. గత ఏడాది కరోనా సమయంలో సూపర్ శానిటేషన్‌కు నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో పంచాయతీల్లో శానిటేషన్ పనులు చేసి వాటికి సంబంధించిన బిల్లులు సమర్పించారు. ఇప్పటివరకు ఆ నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈనేపథ్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప పథకం పేరుతో ప్రక టనలు గుప్పించడమే తప్ప నిధులను విడుదల చేయ డం లేదని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణకే పరిమితమైందని ఆరోపిస్తున్నారు. మురికి కాలువ ల్లో పూడిక తీయడం, శుభ్రపరచడం, కంటైన్‌మెంట్, రెడ్‌జోన్‌లలో సూపర్ శానిటేషన్ నిర్వహిస్తున్నారు. పంచాయతీల్లోని రక్షిత మంచినీటి పథకాలను శుభ్రపరచడం, బోర్లలో క్లోరినేషన్ చేయడం, వీధుల్లో బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. పంచాయతీలలో నిధులు లేక అప్పులు చేసి పెడుతున్నామని సర్పంచ్‌లు వాపోతున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు కమిటీలను ఏ ర్పాటు చేశారు. డివిజన్ స్థాయిలో డీఎల్‌పీవోలు, మండలస్థాయిలో ఈవోపీఆర్డీలు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. వెంటనే పారిశుధ్య పనులకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ప్రత్యేక నిధులు ఇవ్వరా..?
జగనన్న స్వచ్ఛ సంకల్ప నినాదం మంచిదే. పంచాయతీలకు ప్రత్యేకంగా ఆదాయం లేదు. ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టేశాం. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే కరోనా నియంత్రణకు అవసరమైన చర్య లు తీసుకోవడానికి వీలుంటుంది. నిధులు లేక అనుకున్న విధంగా పారిశుధ్య పనులు చేపట్టలేకపోతున్నాం. వెం టనే నిధులు విడుదల చేయాలి. లేకపోతే సాధారణ పంచాయతీల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంటుంది.
- పి.లక్ష్మీప్రసన్న, సర్పంచ్, కొంగళవీడు