ఎంతచేసినా.. ఏకగ్రీవాలపై ఫలించని వైసీపీ వ్యూహం

ABN , First Publish Date - 2021-02-05T06:07:27+05:30 IST

జిల్లాలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. అందులో తొలి విడతగా ఈనెల 9వ తేదీన పోలింగ్‌ జరగనున్న 227 పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం గురువారం సాయంత్రం ముగిసింది. దీంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎంపికైన పంచాయతీలతో పాటు పోటీ జరగనున్న వాటి వివరాలను అధికారికంగా వెల్లడించారు.

ఎంతచేసినా..  ఏకగ్రీవాలపై ఫలించని వైసీపీ వ్యూహం
నాగన్నపాలెం పంచాయతీలో ఏకగ్రీవం అయిన టీడీపీ సర్పంచ్‌ , వార్డు సభ్యులు

 తొలివిడతలో 227కి 35 పంచాయతీలే 

అందులో టీడీపీ మద్దతుదారులకు 5 సర్పంచ్‌ పదవులు 

మరి కొన్నిచోట్ల తటస్థులు

పర్చూరులో ఢీ అంటే ఢీ 

ఎస్‌ఎన్‌పాడులో చీమకుర్తి మండలంలోనే అధికం 

ఒంగోలులో 28కి 3చోట్లే వైసీపీకి ఏకగ్రీవం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

ఏకగ్రీవ ఎన్నికల ద్వారానే అత్యధిక పంచాయతీల్లో పాగా వేయాలనుకున్న అధికార వైసీపీ లక్ష్యం తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఫలించలేదు. అందుకోసం అధికారాన్ని ఫణంగా పెట్టి సామదాన దండోపాయాలను వినియోగించినా 12శాతంలోపు పంచాయతీల్లో మాత్రమే వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా సర్పంచ్‌లయ్యారు. ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడు, చీరాల, కొండపి నియోజకవర్గాలలోని 227 పంచాయతీలకుగాను 35 చోట్ల మాత్రమే సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 5 పంచాయతీలను కైవసం చేసుకోగా మిగిలిన 30 పంచాయతీలలో వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. అయితే ఈ 30మందిలో కూడా కొందరు గ్రామ రాజకీయాలకు అనుగుణ ంగా తటస్థులు ఎంపికకావటం విశేషం.  


జిల్లాలో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికల సమరం ప్రారంభమైంది. అందులో తొలి విడతగా ఈనెల 9వ తేదీన పోలింగ్‌ జరగనున్న 227 పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణల ఘట్టం గురువారం సాయంత్రం ముగిసింది. దీంతో ఏకగ్రీవంగా సర్పంచ్‌లు ఎంపికైన పంచాయతీలతో పాటు పోటీ జరగనున్న వాటి వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఒంగోలు నియోజకవర్గంలో కేవలం మూడు పంచాయతీలలో మాత్రమే వైసీపీ మద్దతు అభ్యర్థులు సర్పంచ్‌లయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో 15 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎంపిక కాగా 11చోట్ల వైసీపీ, నాలుగుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో 13చోట్ల ఏకగ్రీవ ఎంపికలు జరగ్గా 10 చోట్ల వైసీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారుడు, మరో గ్రామంలో తటస్థ అభ్యర్థి సర్పంచ్‌లయ్యారు. టంగుటూరు మండలంలో మూడుచోట్ల వైసీపీ వారు ఏకగ్రీవంగా గెలుపొందారు. చీరాల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీకి ఎన్నిక జరగ్గా దానిని వైసీపీలోని ఎమ్మెల్యే కరణం మద్దతుదారుడు కైవసం చేసుకున్నాడు. 


సీఎం ఆదేశాలిచ్చినా సరే..

ఈ ఎన్నికల సమరం ఆరంభం నుంచి వైసీపీ అధిష్ఠానం కానీ, కిందిస్థాయిలో వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు చేసిన హడావుడి తెలిసిందే. కనీసం 30శాతానికి మించి పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవాలని, మొత్తంగా స్థానికసంస్థల్లో 90శాతం స్థానాలను దక్కించుకోవాలని ఆపార్టీ అధినేత జగన్‌ పార్టీశ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో పంచాయతీలను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు వైసీపీ నేతలు సామదాన దండోపాయాలను వినియోగించారు. పర్చూరు నియోజకవర్గం పెదగంజాంలో టీడీపీ తరఫున పోటీకి సిద్ధమైన వారిని కిడ్నాప్‌ చేయటం అందుకు పరాకాష్ట. మరోవైపు టీడీపీ పక్షాన అనేకచోట్ల నేతలు ముందుండి వ్యవహారాన్ని నడపకపోయినా కేడర్‌ ఉత్సాహంగా ముందుకొచ్చి పోటీకి దిగటం విశేషం. కొన్నిచోట్ల జనసేన కార్యకర్తలు కూడా బరిలో నిలిచారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎస్‌ఈసీ చేపట్టిన చర్యలు ఈ పోటీదారుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. దీనికి తోడు గ్రామ రాజకీయాలు, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తులు పోటీదారులు ముందుకొచ్చేందుకు తోడ్పాడ్డాయి. ఇంకోవైపు అధికారపార్టీ కేడర్‌లో ఉన్న అసంతృప్తులతో పలు పంచాయతీల్లో వైసీపీకి చెందినవారే ఒకరిపై ఒకరు పోటీ కూడా పడ్డారు. ఫలితంగా అనేక గ్రామాల్లో త్రిముఖ పోటీలకు కూడా రంగం సిద్ధమైంది. 


ఒంగోలులో 3 పంచాయతీలు మాత్రమే 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు రూరల్‌ మండలంలో 13, కొత్తపట్నం మండలంలో 15 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఒంగోలు రూరల్‌ మండలంలోని 3 పంచాయతీలను మాత్రమే వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా చేజిక్కించుకోగలిగారు. అయితే ఆది నుంచి టీడీపీకి పట్టున్న గ్రామాలను ఏకగ్రీవంగా దక్కించుకోవటం విశేషం. వలేటివారిపాలెం, కరవది, ఉలిచి  సర్పంచ్‌లుగా వైసీపీ మద్దతు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. టీడీపీ గ్రామాలను చేజిక్కించుకునే విషయంలో కొంతమేర మంత్రి సఫలీకృతులైనప్పటికీ వైసీపీ ఆధిపత్య గ్రామాల్లో సఫలం కాలేకపోయారు. వైసీపీకి పట్టున్న పలు గ్రామాల్లో ఆ పార్టీలోని వ్యక్తులే ఒకరిపై ఒకరు పోటీపడ్డారు. అందుకు చేజర్ల, పాతపాడు, కొత్తపట్నం మండలంలోని కొన్ని గ్రామాలను చెప్పుకోవచ్చు. టీడీపీకి బలమైన మండవవారిపాలెంలో తొలిసారి వైసీపీ అభ్యర్థిని పోటీలోకి దింపగలిగింది. 


 పర్చూరులో పోటాపోటీ 

పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సారథ్యంలో టీడీపీ శ్రేణులు దూకుడుగా పోటీకి సిద్ధమయ్యారు. మొత్తం 95 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 15 పంచాయతీల్లో మాత్రమే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అందులో నాలుగుచోట్ల టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా సర్పంచ్‌లయ్యారు. 11చోట్ల వైసీపీ మద్దతుదారులే ఎంపికయ్యారు. అయితే వాటిలో ఇసుకదర్శి, దేవరపల్లి, ఇనగల్లులాంటి పంచాయతీల్లో గ్రామ రాజకీయాలకు అనుగుణంగా సమానస్థాయిలో సర్పంచ్‌ వైసీపీకిచ్చినా ఉప సర్పంచ్‌ పదవులతో పాటు ఎక్కువ వార్డులను టీడీపీ మద్దతుదారులు పొందగలిగారు. ఇకపోతే వైసీపీకి పూర్తి పట్టున్న ఇంకొల్లు మండలం పావులూరులో సర్పంచ్‌ పదవికి జనసేన పోటీలో నిలబడటం విశేషం. పెదగంజాంలో టీడీపీ మద్దతు అభ్యర్థిని కిడ్నాప్‌నకు ప్రయత్నించి ఎమ్మెల్యే  పోరాటంతో విఫలం చెందిన వైసీపీ నేతల తీరు కూడా నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించింది. ఏకగ్రీవ పంచాయతీల్లో ప్రతిష్టాత్మకమైన లేక పెద్ద పంచాయతీలు లేకపోవటం గమనార్హం. ప్రస్తుతం నియోజకవర్గంలో 80 పంచాయతీల్లో పోటీకి రంగం సిద్ధమైంది. 


ఎస్‌ఎన్‌పాడులో.. 

ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలో 85 పంచాయతీలకుగాను కేవలం 13 సర్పంచ్‌లు మాత్రమే ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వారిలో 10 మంది వైసీపీ మద్దతుదారులు కాగా ఒకరు టీడీపీ, మరొకరు తటస్థ అభ్యర్థి. చీమకుర్తి మండలంలోనే వైసీపీవారు ఏడుచోట్ల ఏకగ్రీవమయ్యారు. 22 పంచాయతీలున్న ఎన్‌జీపాడు మండలంలో కేవలం ఒక చిన్నపంచాయతీలో మాత్రమే ఏకగ్రీవం కాగా మద్దిపాడు మండలంలో మూడుచోట్ల ఏకగ్రీవమైతే అందులో ఒకచోట టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌ కాగలిగారు. నియోజకవర్గంలోని బి.నిడమనూరులో టీడీపీ మద్దతుతో వేసిన ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించినా డమ్మీ అభ్యర్థులు తామున్నామంటూ పోటీలో నిలబడటం విశేషం. 


 టంగుటూరు మండలంలో..

కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో 3 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే మండలంలోని జమ్ములపాలెం పంచాయతీని వైసీపీ మద్దతు అభ్యర్థి రావూరి స్నేహ ఎంపికకు గ్రామానికి చెందిన టీడీపీలోని ప్రధాన నాయకత్వం కూడా సహకరించింది. ఆ గ్రామానికి చెందిన నియోజకవర్గంలో పేరున్న సీనియర్‌ నాయకుడు రావూరి అయ్యవారయ్య ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆయన పట్ల ఉన్న అభిమానంతో తెలుగుదేశం వర్గీయులు కూడా ఆయన కోడలైన స్నేహ ఏకగ్రీవ ఎంపికకు సహకరించారు. 

Updated Date - 2021-02-05T06:07:27+05:30 IST