మానవత్వం చాటారు- అండగా నిలిచారు

ABN , First Publish Date - 2021-05-02T07:15:56+05:30 IST

కరోనా రక్కసికి భయపడి సొంత వాళ్లు సైతం పరాయివాళ్లుగా మారిపోతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌ సోకి ఇబ్బందుల్లో ఉన్న ఓ పూజారి కుటుంబానికి ఏడు గ్రామాల ప్రజలు అండగా నిలిచారు.

మానవత్వం చాటారు- అండగా నిలిచారు

లింగసముద్రం, మే 1: కరోనా రక్కసికి భయపడి సొంత వాళ్లు సైతం పరాయివాళ్లుగా మారిపోతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైరస్‌ సోకి ఇబ్బందుల్లో ఉన్న ఓ పూజారి కుటుంబానికి ఏడు గ్రామాల ప్రజలు అండగా నిలిచారు. రూ.2లక్షల సాయం అందించి వారికి వైద్యమందించారు. మరికొంత ఖర్చైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉండి మానవత్వం చాటారు. అయినా, మాయదారి కరోనా ఆ ఇంటికి ఒకరిని దూరం చేసింది. కరోనాతో పూజారి తల్లి పరిస్థితి విషమంచి రిమ్స్‌లో మృతిచెందగా, పూజారి రిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నాడు. మిగతా కుటుంబసభ్యులు కందుకూరులోకి కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో ఉన్నారు. అందరూ కలిసి ఏడుగురు కరోనా బారినపడ్డారు. లింగసముద్రంలోని ఓ పూజారి తల్లికి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమెను బంధువులు చికిత్స కోసం ఒంగోలులోని రిమ్స్‌లో చేర్పించారు. ఇదేక్రమంలో పూజారికి పాజిటివ్‌ వచ్చింది. ఈయనను లింగసముద్రంలోని వాకమళ్లవారిపాలెం అయ్యప్పస్వామి దేవాలయం నిర్వాహకులు, ఆర్‌ఎంపీ జి.భాస్కర్‌రెడ్డి, వాకమళ్ళవారిపాలెంకు చెందిన పంగా కృష్ణారెడ్డిలు కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు. అయితే అక్కడ పూజారి పరిస్థితి విషమించింది. దీంతో రెండురోజుల క్రితం రిమ్స్‌లో చేర్పించారు. అక్కడ పూజారికి బయట నుంచి ఖరీదైన ఇంజెక్షన్‌ల కోసం దాతలు రూ.2లక్షలు ఖర్చుచేశారు. పూజారి ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధం అని దాతలు ప్రకటించడం గమనార్హం. పూజారి తిమ్మారెడ్డిపాలెం, జంపాలవారిపాలెం, వాకమళ్ళవారిపాలెం, కొత్తపేట, గొల్లపాలెం గ్రామ దేవాలయాల్లో పూజలు చేస్తూ భక్తులకు సుపరిచితులు. దీంతో ఆయా గ్రామాల్లోని భక్తులు విరాళాలు అందజేశారు. బలిజపాలెం, జంగంరెడ్డిపాలెం గ్రామాల ప్రజలు కూడా విరాళాలిచ్చారు. లింగసముద్రం ఎస్సై రమేష్‌ కూడా రూ.5వేలు అందించారు. భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆర్‌ఎంపీ షేక్‌ షఫీలు ఈ విరాళాల ద్వారా వచ్చిన సొమ్మును బాధితులకు చేర్చారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి దాతలు అండగా ఉండడంతో వారి కుటుంబ సభ్యలకు మనోధైర్యాన్ని ఇచ్చింది.

Updated Date - 2021-05-02T07:15:56+05:30 IST