తండోపతండాలుగా సొంతగూటికి..

ABN , First Publish Date - 2021-10-28T06:57:24+05:30 IST

వైసీపీ పాలన ప్రజలకు నచ్చడం లేదు, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ తండోపతండాలుగా సొంతగూటికి చేరుతున్నారు.

తండోపతండాలుగా సొంతగూటికి..
ఖాజీపురంలో పార్టీలో చేరిన వారితో టీడీపీ నాయకులు

వైసీపీ నుంచి టీడీపీలోకి  భారీగా చేరికలు

గిద్దలూరు నియోజకవర్గం నుంచి మార్పు ప్రారంభం

సైకిలెక్కిన 400 కుటుంబాలకు చెందిన 1,100 మంది 

జిల్లా టీడీపీ నాయకులందరూ బీపేట మండలంలో..

వారికి ఘనస్వాగతం పలికిన ప్రజలు

బేస్తవారపేట, అక్టోబరు 27 : వైసీపీ పాలన ప్రజలకు నచ్చడం లేదు, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ తండోపతండాలుగా సొంతగూటికి చేరుతున్నారు. బేస్తవారపేట మండలం ఖాజీపురంలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో ఆ గ్రామానికి చెందిన జగ్గంబొట్ల కృష్ణాపురం ఎంపీటీసీ పూనూరు భూపాల్‌రెడ్డి వైసీపీకి, ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో తన అనుచరులతో కలిసి చేరారు. ఈకార్యక్రమానికి జిల్లాలోని టీడీపీ ముఖ్యనాయకులంతా రాగా మండలంలోని ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో రెండుసార్లు టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశానని, తాను ఒక నాయకుడి మాట నమ్మి పార్టీని వీడానని తెలిపారు. చేసిన తప్పు తెలుసుకొని ఇప్పుడు అనుచరులతో కలిసి మండలంలోని 400 కుటుంబాల్లోని 11వందల మందితో టీడీపీలో చేరానని పేర్కొన్నారు. ఖాజీపురం సర్పంచ్‌ సూరం మల్లేశ్వరి, మండలంలోని గలిజేరుగుళ్ళ, చెన్నుపల్లె, అక్కపల్లె, పి.వి.పురం, జగ్గంబొట్ల కృష్ణాపురం, జెన్నివారిపల్లె గ్రామాల ప్రజలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటూ ఉంటే అది ఒక టీడీపీ పాలనలోనే సాధ్యమైందన్నారు. సుంకేసుల నుంచి గిద్దలూరు నియోజకవర్గానికి తాగునీటి కోసం ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ కోసం టీడీపీ ప్రభుత్వంలో పనులకు టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపివేసి అభివృద్ధికి ఆటంకం కలిగించిందని అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు విసుగుచెందారని, అందరూ సొంతగూటికి చేరుతున్నారని, అది జిల్లాలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమైందన్నారు గతనెలలో 2వేల మంది, నేడు 1,100 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరడం చూస్తే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని స్పష్టమైందని పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని, చార్జీలు పెంచుకుపోతున్నారని అదే విద్యుత్‌ శాఖ మంత్రి మన జిల్లా వాసి కావడం మన దురదృష్టకరమని అన్నారు. అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, రౌడీయిజం ప్రారంభమైందని తెలిపారు. ప్రధాన పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. ఆ నాయకులకు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారి దుర్మార్గానికి స్వస్తి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే మన కర్తవ్యమని, ప్రజలు అబివృద్ధిని చూసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దర్శి, వైపాలెం ఇన్‌చార్జిలు పమిడి రమేష్‌, గూడూరి ఎరిక్షన్‌బాబు, ఒంగోలు పార్లమెంటరీ స్థానం అధ్యక్షుడు నూకసాని  బాలాజీ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆర్‌.పద్మజ, పార్టీ మండల అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, జి.రామలింగారెడ్డి, ఎంపీ వెంకటరెడ్డి, గాజుల విశ్వనాఽథం, పూనూరు జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-10-28T06:57:24+05:30 IST