గుంటూరు-గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు డల్‌

ABN , First Publish Date - 2021-01-13T06:38:34+05:30 IST

కోస్తా, రాయలసీమను వారధిగా నిలిచే గుంటూరు-గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు నాలుగేళ్లగా నత్తనడకన సాగుతున్నాయి.

గుంటూరు-గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు డల్‌
అర్ధంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి పనులు

రూ.3,631 కోట్ల అంచనా వ్యయం

నెమ్మదిగా సాగడంపై  రైల్వేశాఖ ఆగ్రహం

కురిచేడు, జనవరి 12 : కోస్తా, రాయలసీమను వారధిగా నిలిచే గుంటూరు-గుంతకల్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులు నాలుగేళ్లగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన కాంట్రాక్టర్‌ సబ్‌ కాంట్రాక్టర్‌కు ఇచ్చి చేతులు దులుపుకోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగళి’ అక్కడే అన్న చందంగా ఉంది. నాలుగేళ్ల క్రితం గుంటూరు-గుంతకల్‌ రైల్వే లైను డబ్లింగ్‌ పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఈ లైన్‌కు మహర్దశ పడుతుందని ప్రజలు ఆశించారు. రెండో లైను నిర్మాణం, విద్యుద్దీకరణ రెండూ ఏకకాలంలో పూర్తిచేస్తామని రైల్వే శాఖ ప్రకటించడం, ఆ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.3,631కోట్లు కేటాయించడంతో ఈ ట్రాక్‌ వెంబడి అభివృద్ధి కూత పెడుతుందని ప్రజలు సంబరపడ్డారు. అయితే అనుకున్నంత వేగంగా పనులు జరుగడం లేదు. చాలాచోట్ల రెండో లైన్‌ కోసం మట్టి తోలకం ప్రారంభించి వదిలేశారు. మట్టి తోలిన ప్రదేశాల్లో చెట్లు కూడా మొలిచాయి.  


ఇక్కట్లు తొలగుతాయనుకుంటే..

గుంటూరు- గుంతకల్‌ రైల్వే మార్గంలో 401.47కి.మీలకు ఒకే లైన్‌ ఉంది. ఈ లైన్‌లో ఎదురుగా మరేదైనా రైలు వస్తుంటే స్టేషన్‌లోనే గంటలకొద్దీ ప్రయాణికుల రైలు నిలిచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఎన్ని గంటలకు గమ్యస్థానాలకు చేరేది రైలు దిగే వరకు చెప్పగలిగే పరిస్థితి కాదు. దీంతో పలుమార్లు ప్రయాణికులు రైల్వే అధికారులతో ఘర్షణ పడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో లైన్‌ ఏర్పాటు ప్రతిపాదనతో తమ ఇక్కట్లు తొలగుతాయని ప్రజలు భావించారు. ప్రభుత్వం నిధుల కేటాయింపుతో పనులు వేగంగా జరుగుతాయని అనుకున్నారు. అందుకు భిన్నంగా ఇంజనొదిలేసిన బోగీల మాదిరి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తమ ఇక్కట్లు తొలగిదెప్పుడని నిట్టూరుస్తున్నారు.


అభివృద్ధికి అవకాశాలు

ఈ మార్గంలో రెండో లైన్‌ ఏర్పాటు వలన ప్రయాణ సమయం ఎంతో ఆదా కానుంది. రాయలసీమకు ఇది వరప్రదాయని అయ్యే అవకాశాలున్నాయి. ఈ మార్గంలో గూడ్సు రైళ్ల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు.  చెన్నై- కోల్‌కతా రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. తుఫాన్‌లు వచ్చినపుడు ఈ మార్గం ఉపయోగపడుతుంది. గుంటూరు డివిజన్‌లో ప్రస్తుతం సంవత్సరానికి సరుకు రవాణా ద్వారా రూ.500 కోట్లు ఆదాయం వస్తుంది. ఈ రైల్వే లైన్‌ పూర్తి అయితే దాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ మార్గానికి వెచ్చిస్తున్న నిధులు 4 సంవత్సరాలలోనే తిరిగి రాబట్టుకొనే అవకాశాలు ఉన్నాయని  రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం నాలుగు జిల్లాల మీదుగా ఇది వెళుతుంది. దీంతో రైల్వేకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. 


పనుల జాప్యంపై అధికారుల ఆగ్రహం

డబ్లింగ్‌ పనులలో జాప్యంపై రైల్వే అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇక్కడ పనులు చేసిన సబ్‌ కాంట్రాక్టర్‌ పనులు ఎక్కడివక్కడే వదిలేసి పలాయనం చిత్తగించారు. అయితే ఎప్పటికి ఈ పనులు పూర్తవుతాయో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. నల్లపాడు నుంచి సాతులూరు వరకు   21.8 కి.మీ మేర డబ్లింగ్‌, విద్యుదీకరణ పూర్తి, డోన్‌ నుంచి పెండేకల్లు వరకు 28 కి.మీ డబ్లింగ్‌, విద్యుదీకరణ పూర్తయింది. మిగిలిన 340 కిలోమీటర్లు  ఎప్పటికీ పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. 


Updated Date - 2021-01-13T06:38:34+05:30 IST