ఘనంగా తెలుగుభాష దినోత్సవం
ABN , First Publish Date - 2021-12-31T06:24:34+05:30 IST
మండలంలోని వీఆర్ కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఇందిరమ్మ ఆధ్వర్యంలో జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.

వీఆర్ కోట(లింగసముద్రం)డిసెంబరు 30 : మండలంలోని వీఆర్ కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఇందిరమ్మ ఆధ్వర్యంలో జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుడు జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అమ్మ భాష, అమృత భాష అయిన తెలుగు గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు.
మొగిలిచెర్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పద్యపఠనం, వ్యాసరచన, ఆటలు, పాటలు, భావవ్యక్తీకరణ, నటన వంటి పోటీలు నిర్వహించారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషోత్సవాల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మూగిసిన వేడుకలు
పీసీపల్లి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా భాషాదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముగింపు రోజైన గురువారం తెలుగుభాష ఔన్నత్యం గురించి హెచ్‌ఎం కే.శ్రీనివాసులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం వేదికగా పలువురు విద్యార్థులు తెలుగుతల్లి, కవులు,రైతు, సైనికుల వేషాధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు జీవీ.మాల్యాద్రి, జి.ప్రసాద్, ఎం.నరసింహం, ఎస్.శ్రీనివాసరావు, ఎస్.ఏసుబాబు, జి.మాల్యాద్రి, ఆశా సుధీర, నజీరాబేగం, పరమల సుభాషిణి, షమ్మా,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత
దొనకొండ : తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగుబాషలోని పద్యాలు, నుడికారాలు, పొడుపు కధలు ఏ భాషలో లేవని ప్రధానోపాధ్యాయుడు టి రాజశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని గంగదేవిపల్లి పాఠశాలలో గురువారం తెలుగుభాషోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు వివిధ వేషధారణలో అకట్టుకున్నారు. విద్యార్థులు తెలుగుభాష ప్రాముఖ్యతను సూచించేలా సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె వెంకటేశ్వర్లు, ఎం.జోజప్ప, మల్లిఖార్జున పాల్గొన్నారు.
కనిగిరి : మాతృభాషలో చదివే విద్యార్థులకు ఏకగ్రత అధికంగా ఉంటుందని తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.మారుతిదేవి అన్నారు. తెలుగుభాష దినోత్సవం సందర్భంగా మండలంలోని వాగుపల్లి ఎంపీయూపీ స్కూల్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల్యం నుంచే విద్యపై ఆసక్తి పెంచుకుంటే చక్కటి ఫలితాలు సాధించవచ్చన్నారు. తెలుగు భాషలోని గొప్పతనాన్ని అక్షరాల వర్ణనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వకృత్వం, కవితలు, పద్యాలు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సందానీబాష, పుల్లయ్య, రమేష్, విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హెచ్‌ఎం ఎన్‌వీవీ ప్రసాదరావు, తెలుగు ఉపాధ్యాయురాలు టి.గాయత్రి, రంజాన్‌బీ విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ఘనంగా తెలుగుభాష వారోత్సవాలు
పామూరు : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుభాష వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఇంగ్లీషు, తెలుగు, హిందీ పరీక్షల్లో 100 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో గురువారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్ధులు, పాల్గొన్నారు.
కందుకూరు : స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం తెలుగుభాష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఎం అనూరాధ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు భావాలను, బాషను మార్చుకుని నిత్యం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు డి.నారాయణమ్మ, చిత్తారు వెంకటేశ్వర్లు, సంస్కృత పండిట్ లావణ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.