పొగాకు రైతులను అప్పుల్లోకి నెడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-07-13T05:25:25+05:30 IST

పొగాకు రైతులను ప్రభుత్వమే నష్టాల ఊబిలోకి నెట్టేలా వ్యవహరిస్తోందని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి అన్నారు.

పొగాకు రైతులను అప్పుల్లోకి నెడుతున్న ప్రభుత్వం
వేలం నిర్వహిస్తున్న అధికారులు

 ఏపీ రైతు సంఘం నాయకులు పిల్లి తిప్పారెడ్డి

కనిగిరి, జూలై 12: పొగాకు రైతులను ప్రభుత్వమే నష్టాల ఊబిలోకి నెట్టేలా వ్యవహరిస్తోందని ఏపీ రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పిల్లి తిప్పారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని పొగాకు బోర్డు వద్ద సోమవారం రైతులు కొద్దిసేపు వేలం నిలిపి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది లోగ్రేడ్‌ పొగాకు కిలో రూ.75లు లెక్కన కొనుగోలు చేసిన ప్రభుత్వం ఎగుమతి లేదనే  సాకుతో ఇప్పుడు రూ.50కు ఇస్తుండడంతో రైతుల వద్ద లో గ్రేడ్‌ పొగాకు అమ్ముడు పోవడం లేదన్నారు. మరో వైపు పొగాకు బోర్డు అధికారులు కుమ్మకై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వమే లోగ్రేడు పొగాకును 75 రూపాయలకు కొనుగోలు   చేస్తుంటే, ప్రైవేటు పొగాకు కంపెనీలు తక్కువ ధరకు కొంటామని చెప్పడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా వేలం తేది ముగుస్తుందని సమాచారం ఇవ్వడంతో రైతులు ట్రాక్టర్లలోని బేళ్ల వద్దే పడిగాపులు కాస్తున్నారన్నారు. తీరా ఇప్పుడు తెచ్చిన బేళ్లను కొనుగోలు చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. గతంతో రూ.180లు పలికిన పొగాకు ఇప్పుడు రూ130లకు, రూ.130లు ఉన్న పొగాకుకు రూ.70లు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అనంతరం బోర్డు వేలంఅధికారి శ్రీనివాసరావు బయ్యర్లతో, రైతులతో, పొగాకు యూనియన్‌ నాయకులతో చర్చించి ఆమోదయోగ్యమైన ధర ఇప్పిస్తామని తెలపడంతో వేలం జరిగింది. వేలంకేంద్రానికి 1046 బేళ్ళు రాగా, వాటిలో 876 బేళ్లకు వేలం జరిగింది. 


Updated Date - 2021-07-13T05:25:25+05:30 IST