ఎమ్మెల్యే గొట్టిపాటికి సుప్రీంలో ఊరట

ABN , First Publish Date - 2021-12-07T06:35:25+05:30 IST

టీడీపీకి చెం దిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

ఎమ్మెల్యే గొట్టిపాటికి సుప్రీంలో ఊరట

హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై స్టే 

తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు సింగిల్‌ బెంచ్‌ తీర్పే కొనసాగింపు

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీకి చెం దిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు గొట్టిపాటికి చెందిన కిశోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వివరణ ఇవ్వాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాననం మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వచ్చాక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన రెండు కంపెనీల క్వారీల్లో అవకతవకలు జరుగుతున్నాయని విజిలెన్స్‌ నివేదిక రూపొందించి.. రాష్ట్ర గనుల శాఖకు నివేదించింది. దాని ఆధారంగా ఆ కంపెనీలకు భారీ జరిమానా విధిస్తూ గనుల శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వాటిని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును డివిజన్‌ బెంచ్‌ పక్కన బెట్టి.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కంపెనీలను ఆదేశించడంతో అవి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ  చేపట్టి స్టే ఇచ్చింది. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డు గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ హాజరయ్యారు.




Updated Date - 2021-12-07T06:35:25+05:30 IST