డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-06-22T07:05:39+05:30 IST

డీఎస్సీ-2008 అభ్యర్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,193మందిని మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

డీఎస్సీ 2008 అభ్యర్థులకు శుభవార్త

150మందికి కాంట్రాక్టు టీచర్లుగా అవకాశం 

ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ కార్యదర్శి

ఒంగోలు విద్య, జూన్‌ 21 : డీఎస్సీ-2008 అభ్యర్థుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,193మందిని మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌తో కాంట్రాక్టు టీచర్లుగా నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో జిల్లాలో 150మంది డీఎస్సీ-2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు దక్కనున్నాయి. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగాలకు ఇంటర్‌, డీఈడీ విద్యార్హతలు ఉన్నవారు మాత్రమే అర్హులనే నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనిపై డిగ్రీ, బీఈడీ విద్యార్హతలు ఉన్నవారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు వెలువడేలోపే ఇంటర్‌, డీఈడీలు ఉన్నవారితో పోస్టులకు రోస్టర్‌కమ్‌ మెరిట్‌లో జాబితాను తయారుచేశారు. అప్పుడే హైకోర్టు డిగ్రీ, బీఈడీలు ఉన్నవారిని కూడా పోస్టులకు అనుమతించాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో మధ్యేమార్గంగా 30శాతం పోస్టులను ఇంటర్‌, డీఈడీలు ఉన్నవారితో.. మిగిలిన 70శాతం పోస్టులను ఉమ్మడి మెరిట్‌ ప్రకారం భర్తీ చేశారు. ఎంపిక విధానంలో చోటుచేసుకున్న మార్పులతో 4,657 మంది అభ్యర్థులు మిగిలిపోగా వీరిలో ప్రస్తుతం 2,193మందిని కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. 60ఏళ్ల వయస్సు వరకు కొనసాగిస్తామనే హామీ లేకుండా వీరిని నియమిస్తారు. రెగ్యులర్‌ ఉపాధ్యాయులకు ఉన్న బెనిఫిట్లు వీరు కోరడానికి వీలులేదని పేర్కొన్నారు. ప్రస్తుతం  భర్తీచేసే పోస్టులను రాబోయే డీఎస్సీలో తగ్గిస్తారు.  


Updated Date - 2021-06-22T07:05:39+05:30 IST