ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
ABN , First Publish Date - 2021-09-13T05:12:11+05:30 IST
గత మూడు రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు ఆదివారం నిమజ్జనానికి బయలుదేరారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన
మున్సిపల్ చైర్మన్ వెంకటసుబ్బయ్య
వేలం పాటల్లో లడ్డూలను దక్కించుకున్న భక్తులు
గిద్దలూరు టౌన్, సెప్టెంబరు 12 : గత మూడు రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు ఆదివారం నిమజ్జనానికి బయలుదేరారు. ప్రత్యేక మండపాలు, పూజలు జరుగగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండలంలో అధికారుల ఆంక్షల నడుమ మండపాలు ఏర్పాటు చేసుకుని విగ్రహాలను నిలుపుకోగా మూడు రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడు ఆదివారం మధ్యాహ్నం మండపాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్ళి నిమజ్జనం అయ్యారు. నగర పంచాయతీ పరిధిలోని పాములపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద మున్సిపల్ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా గిద్దలూరు పట్టణంలోని శర్మవీధిలో గల జువ్విళ్ళబావి వినాయకుడి దగ్గర నిర్వహించిన వేలంపాటల్లో స్వామి వారి లడ్డూ 30,100 రూపాయలకు పల్లె సుధాకర్‌రెడ్డి దక్కించుకున్నారు. పాతసత్యనారాయణ థియేటర్ దగ్గర గల వినాయకస్వామి 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో లడ్డూను గోకుల శ్రీకృష్ణ 30వేలకు దక్కించుకున్నారు. నిమజ్జనం సందర్భంగా సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ బ్రహ్మనాయుడు, పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్‌లో..
మార్కాపురం(వన్‌టౌన్) : స్థానిక వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వెన్నా ఇందిరా మాట్లాడుతూ పండుగలు ఐకమత్యానికి చిహ్నాలన్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.
తర్లుపాడులో..
తర్లుపాడు : మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను 3వ రోజు ఆదివారం నిమజ్జనానికి తరలిం చారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి భక్తులు విగ్రహాలకు వార్లుపోసి కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కోవిడ్ కారణంగా పోలీసుల ఆధ్వర్యంలో డబ్బు వాయిద్యాలు లేకుండా గ్రామోత్సవం నిర్వహించారు. మండలంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను బొడిసర్లె గుండ్లకమ్మ వాగులో నిమ జ్జనం నిర్వహించారు. ఏఎస్‌ఐ సంజీవ్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పెద్దదోర్నాలలో..
పెద్ద దోర్నాల : భ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాలలో వినాయక నిమజ్జన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల చైర్మన్ సుధాకర్ రెడ్డి కరెస్పాండెంట్ భట్టు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జైగణేశ జై బోలో గణేశా అంటూ ఉత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఘంటవానిపల్లె చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
వేలంపాటలో దక్కిన లడ్డూ
కొమరోలు : మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను మూడు రోజులుగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, బాదినేనిపల్లి, కొమరోలు గ్రామాల్లోని వినాయక విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ గణనాఽఽథులను భాజాభజంత్రీలతో నిమజ్జనం నిర్వహించారు. స్థానిక మఠంబజారులో వినాయక నిమజ్జంలో కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు.
కొమరోలులోని వినాయక స్వామి దేవాలయంలోని లడ్డూను రూ.8100 టీడీపీ మండల అధ్యక్షుడు చలిచీమల శ్రీనివాస చౌదరి, మూలపల్లి గ్రా మంలో దనిరెడ్డి పెద్ద రోసిరెడ్డి రూ.30వేలకు, కొమరోలులోని మఠం బజా రులోని లడ్డూ ప్రసాదాన్ని రూ.6500కు ఆరే తిరుమలగిరి, నాగిరెడ్డిపల్లి గ్రామంలో చల్లా రాజూ రూ.15వేలు, పోసుపల్లిలో బొంతా రమణారెడ్డి రూ.6వేలు, పామూరుపల్లిలో పోలు రామిరెడ్డి రూ.10,100, తాతిరెడ్డిపల్లి ఎస్‌సీ కాలనీలోని వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని తిరుమలయ్య రూ.20, 500లకు వేలంపాటలో దక్కించుకున్నారు.
