ఫండింగ్‌.. పెండింగ్‌

ABN , First Publish Date - 2021-12-29T04:34:35+05:30 IST

సాధారణంగా ఏదైనా ఒక పార్టీ తరఫున ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు సైతం ఎగిరిగంతులేస్తారు.

ఫండింగ్‌.. పెండింగ్‌

గ్రామాల్లో లబోదిబోమంటున్న వైసీపీ నేతలు

అభివృద్ధి పనులకు చెల్లించని బిల్లులు

నెలల తరబడి ఎదురు చూపులు

ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక కన్నీళ్లు

మర్రిపూడి మండలంలో రూ.2.40 కోట్ల బకాయిలు


మర్రిపూడి, డిసెంబరు 28 : సాధారణంగా ఏదైనా ఒక పార్టీ తరఫున ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నేతలు సైతం ఎగిరిగంతులేస్తారు. ఇక పెత్తనమంతా తమదేనని, ప్రజలు అడిగిన పనులు చేసిపెట్టడమేగాక, అభివృద్ధి పనులు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని సంబరపడుతుంటారు. కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆ పార్టీ చోటామోటా నాయకుల కథ అడ్డం తిరిగింది. నాలుగు రాళ్లు వెనకేసుకోవడం అటుంచితే ఉన్నవి ఊడిపోయే ప్రమాదం ఏర్పడిందని వారు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ అభివృద్ధి పనులను గ్రామస్థాయి నాయకులు(కాంట్రాక్టర్ల పేరుతో) ఎంతో ఉత్సాహంగా చేపట్టారు. తీరా పనులు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. లాభం మాట దేవుడికెరుక అప్పులు తెచ్చి చేశామని, వాటి తాలూకు వడ్డీలూ చెల్లించలేని దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. 

మండలంలోని 13 పంచాయతీలలో 5.85 కిలోమీటర్ల మేర సిమెంట్‌ రోడ్డు పనులకు ఉపాధిహామీ పథకం కింద ప్రభుత్వం రూ.3.604 కోట్లు మంజూరు చేసింది. కూచిపూడి, పన్నూరు, రేగలగడ్డ పంచాయతీలలో రూ.1.5 కోట్లతో 3 కి.మీ మేర ఆయా గ్రామాల పార్టీ నాయకులు సిమెంట్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. జువ్విగుంట, గార్లపేట, వేమవరం, గండ్లసముద్రం, చిలంకూరు, కాకర్ల, శివరాయునిపేట గ్రామ పంచాయతీలలో రూ. 20 లక్షల చొప్పున అంతర్గత సిమెంట్‌ రోడ్ల పనులు పూర్తి అయ్యాయి. చిమట పంచాయతీలో రూ.40 లక్షలు, గంగపాలెం, వెంకటకృష్ణాపురం, అయ్యవారిపాలెం పంచాయతీలలో రూ.10 లక్షల చొప్పున రూ. 2.85 కి.మీ రహదారులను అభివృద్ధి చేశారు. ఈ పనులకు సంబంధించి కూచిపూడి, జువ్విగుంట, వేమవరం, పన్నూరు, చిమట, రేగలగడ్డ, గంగపాలెం గ్రామాల్లో చేపట్టిన సిమెంట్‌ రోడ్డు పనులకు రూ.2.40 కోట్ల బిల్లులు 9 నెలలుగా ఆగిపోయాయి. ఈ పనుల కోసం తెచ్చిన అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయని, ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టర్లు వేడుకుంటున్నారు. 


Updated Date - 2021-12-29T04:34:35+05:30 IST