న్యాయవాది నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా

ABN , First Publish Date - 2021-12-08T04:20:59+05:30 IST

సాధారణ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ శాఖలకు సంబంధించిన కేసుల్లో తమ వాదనలను సమర్థంగా వినిపించిన కుంభజడల మన్మధరావు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

న్యాయవాది నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా
కుంభజడల మన్మధరావు

సింగరాయకొండ వాసికి అరుదైన గుర్తింపు

ఆనందం వ్యక్తం చేస్తున్న బంధువులు, స్నేహితులు

సింగరాయకొండ, డిసెంబరు 7 : సాధారణ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం తరఫున వివిధ శాఖలకు సంబంధించిన కేసుల్లో తమ వాదనలను సమర్థంగా వినిపించిన కుంభజడల మన్మధరావు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో సింగరాయకొండలో పండగ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... కుంభజడల రామ్మూర్తి, ఝాన్సీలక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో సంతానంగా మన్మధరావు 1966 ఏడాదిలో జన్మించారు. తండ్రి ఇరిగేషన్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2000లో ఉద్యోగ విరమణ చేశారు. మన్మధరావు అమ్మమ్మ గ్రామం మండలంలోని బింగినపల్లి కాగా, నాన్న సొంత ఊరు ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం. మన్మధరావు జడ్జిగా నియమితులు కావడంతో ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు, ఆయన స్నేహితులు, బంధువుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.


మన్మధరావు సింగరాయకొండ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసించారు. 10వ తరగతి కావలి విశ్వోదయ హై స్కూలులో, ఇంటర్‌ జవహర్‌భారతి జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశా రు. అనంతరం ఒంగోలులోని సీఎ్‌సఆర్‌ శర్మ డిగ్రీ కళాశాలలో బీకాం చదివారు. విశాఖపట్నంలోని ఎన్‌వీపీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీని పూర్తి చేశారు. బీఎల్‌, ఎల్‌ఎంను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేయగా, మేధోసంపత్తి హక్కుల చట్టంపై ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పట్టాను పొందారు.


న్యాయవాదిగా ప్రస్థానం...

మన్మధరావు 1991 ఏడాదిలో న్యాయవాదిగా తన పేరును నమోదు చేసుకున్నారు. 1993 నుంచి కందుకూరు కోర్టులో సొంతగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 1999 నుంచి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కేసులు వాదించారు. 2008-16 మధ్యకాలంలో కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2016లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌(ఈడీ) తరఫున పీపీగా, పబ్లిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వశాఖ ద్వారా నియమితులయ్యారు. 2016లో సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా కేంద్ర ప్రభుత్వంలోని న్యాయశాఖ ద్వారా నియమితులయ్యారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థికమంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్సీ విభాగం పీపీగా నియమితులై హైకోర్టులో తన వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో 2019 నుంచి అమరావతిలోని హైకోర్టులో న్యాయవాదిగా పలు కేసులు వాదిస్తున్నారు.  అమరావతి హైకోర్టులో బుధవారం మన్మధరావు జడ్జిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


చాలా ఆనందంగా ఉంది

బాల్య స్నేహితుడు, సహవిద్యార్థి, తోటి న్యాయవాదిగా పనిచేసిన మన్మధరావు నిబద్దతతో పనిచేసి జడ్జిగా నియమితులు కావడం ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అప్పగించిన వివిధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ అంచలంచెలుగా ఎదిగారు.


సన్నెబోయిన శ్రీనివాసులనాయుడు, న్యాయవాది 

మానవతా వాది

చదువుకునే రోజుల నుంచి నాకు మంచి స్నేహితుడు. విద్యార్థి దశ నుంచి చురుకుగా ఉండేవారు. సహవిద్యార్థులతో స్నేహంగా మెలిగేవారు. అన్నింటి కంటే మంచి మనవాతవాది. మా స్నేహితుడు ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వకారణంగా ఉంది.

నూతలపాటి లక్ష్మోజీ హెచ్‌ఎం, సింగరాయకొండ 

Updated Date - 2021-12-08T04:20:59+05:30 IST