అగ్ని'కి నిర్లక్ష్యపు ఆజ్యం

ABN , First Publish Date - 2021-02-27T05:02:38+05:30 IST

ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అగ్నిమాపకశాఖ(ఫైర్‌ ఇంజన్‌) వాహనమే. ఆ వాహనమే డొక్కుగా తయారైంది.. అంతేగాక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఉండే నీటి బోరు సైతం ఒట్టిపోయింది. బండి సరిగా కదలక, నీరు అందుబాటులో లేక కంభం అగ్నిమాపక శాఖ కార్యాలయంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అగ్ని'కి నిర్లక్ష్యపు ఆజ్యం
డొక్కు బండి


మూడు మండలాలకు డొక్కు ఫైర్‌ ఇంజినే దిక్కు

అగ్నిమాపక కేంద్రంలో ఒట్టిపోయిన బోరు

ఇతర ప్రైవేటు బోర్ల వద్ద నింపుతున్న నీరు

ప్రమాదస్థలిలో నీరు అయిపోతే 70 కిలోమీటర్లు వెళ్లి రావాల్సిందే

కంభం కేంద్రం పరిధిలో ప్రమాదం వాటిల్లితే మిగిలేది బూడిదే!


ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అగ్నిమాపకశాఖ(ఫైర్‌ ఇంజన్‌) వాహనమే. ఆ వాహనమే డొక్కుగా తయారైంది.. అంతేగాక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఉండే నీటి బోరు సైతం ఒట్టిపోయింది. బండి సరిగా కదలక, నీరు అందుబాటులో లేక కంభం అగ్నిమాపక శాఖ కార్యాలయంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.


కంభం, ఫిబ్రవరి 26 : కంభం, అర్థవీడు, బేస్తవారపేట మండలాలకు కలిపి కంభంలో ఒక్కటే అగ్నిమాపక కేంద్రం ఉంది. 1984లో ప్రారంభించిన కంభం అగ్నిమాపక కేంద్రంపై మూడు మండలాలకే కాక మార్కాపురం డివిజన్‌లో ఏ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినా కంభం అగ్నిమాపక సిబ్బందే ఘటనా స్థలానికి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఆ కేంద్రం నీటి కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన తొమ్మిదేళ్ల క్రితం నాటి బోరు ప్రస్తుతం ఒట్టిపోయింది. అప్పటి నుంచి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని పట్టుకు ని రావలసిన పరిస్థితి ఉంది. నూతన బోరుకు నిధు లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. 

మళ్లీ నీటిని నింపాలంటే 70 కిలోమీటర్లు వెళ్లాల్సిందే

అర్థవీడు మండలంలోని వెలగలపాయ, పాపినేనిపల్లె లోయలో గాని, బేస్తవారపేట మండలంలోని కోనపల్లె లోయలో గాని అగ్నిప్రమాదాలు జరిగి బండి అక్కడకెళ్లాక నీరు అయిపోతే సుమారు 70 కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని నింపుకుని ప్రమాద స్థలానికి మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని సిబ్బంది చెప్తున్నారు. ఈ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగితే వాహనంలో నీరు అయిపోతే మరోసారి ట్యాంక్‌ నింపుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని సిబ్బంది అంటున్నారు. వాహనం 2002 నా టి పాత బండి కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్‌ సెక్షన్‌లో బండి ఎక్కాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒట్టిపోయిన బోరు స్థానంలో నూతన బోరు వేయించాలని, అలాగే నూతన వాహనాన్ని మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

బోరు లేక ఇబ్బంది

ప్రసాదరావు, అగ్నిమాపక శాఖ అధికారి 

కంభం అగ్ని మాపక కేంద్రంలో తొమ్మిదేళ్ల క్రితం బోరు చెడిపోయింది. నీటి సేకరణకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికే 50కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. వచ్చే ఏండా కాలంలో ప్రమాదాలకు అవకాశం ఉంది. నీటి సమస్యతోపాటు కొత్త వాహనాన్ని మంజూరు చేయాలి.Updated Date - 2021-02-27T05:02:38+05:30 IST