ప్రజా ఉద్యమాలు.. సంస్థాగతంగా బలోపేతం
ABN , First Publish Date - 2021-01-20T06:43:46+05:30 IST
రైతాంగ సమస్యలపై పోరాటాలు ఒకవైపు, గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం మరోవైపు లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేయాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది.

టీడీపీ బాపట్ల పార్లమెంట్ సమన్వయ కమిటీ తీర్మానం
రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శ
ఒంగోలు డెయిరీని పరిరక్షించాలని డిమాండ్
ఒంగోలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రైతాంగ సమస్యలపై పోరాటాలు ఒకవైపు, గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం మరోవైపు లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేయాలని టీడీపీ బాపట్ల పార్లమెంట్ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. మార్టూరు సమీపంలోని ఏలూరి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. టీడీపీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఆ పరిధిలో నియోజకవర్గ బాధ్యులైన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎస్‌ఎన్‌పాడు, చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జిలు బీఎన్ విజయకుమార్, యడం బాలాజీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలో వివిధ వర్గాల ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలతో వారికి జరుగుతున్న నష్టాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతు సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. రైతుల పట్ల రాష్ట్రప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తుఫాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన తర్వాత కానీ రైతులను పట్టించుకోలేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో ధరలు లేక, కొనుగోలు చేసేవారు కరువై రైతులు నష్టపోతున్నారన్నారు. వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులకు ఉరితాళ్లు బిగించే విధంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించాలని నిర్ణయించిందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఒంగోలు డెయిరీ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. వందల కోట్ల ఆస్తులు ఉన్న డెయిరీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తూ సంస్థ పరిరక్షణ కోసం, అలాగే రైతుసమస్యలపై పోరాడాలని తీర్మానించారు. మరోవైపు గ్రామ, మండలస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీ కమిటీలు ఏర్పాటుచేసి సంస్థాగతంగా బలోపేతం చేయాలని తీర్మానించారు. సమావేశంలో బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర కమిటీ సభ్యులు తాతా జయప్రకాష్, సలగల రాజశేఖర్, తూనుగుంట్ల సాయిబాబు, తూపాటి ఏసుబాబు, దాసరి ఉషారాణి, తెలుగురైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని, టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర పాల్గొన్నారు.