ఉత్సాహం నింపుతున్న నోడల్‌స్టోర్‌

ABN , First Publish Date - 2021-12-27T05:21:57+05:30 IST

గ్రామాల్లో గతంలో వంటింటికే పరిమితమైన పలువురు మహిళలు నేడు గ్రామాల్లోనే దుకాణాలు పెట్టుకొని వారి జీవనోపాధి పొందుతున్నారు.

ఉత్సాహం నింపుతున్న నోడల్‌స్టోర్‌

కోటిన్నరకు దాటిన టర్నోవర్‌   

తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులు

దొనకొండ, డిసెంబరు 26 : గ్రామాల్లో గతంలో వంటింటికే పరిమితమైన పలువురు మహిళలు నేడు గ్రామాల్లోనే దుకాణాలు పెట్టుకొని వారి జీవనోపాధి పొందుతున్నారు. దొనకొండలో వైకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నోడల్‌స్టోర్‌ మహిళలకు ఎంతో దోహదపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పడుతోంది. పొదుపు మహిళలకు తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందించాలనే లక్ష్యంతో 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.18 లక్షలతో దొనకొండలో నోడల్‌స్టోర్‌ ప్రారంభించారు. వెలుగు సిబ్బంది గ్రామాల్లో మహిళలను  చైతన్యపరిచారు. మహిళలు ఈ స్టోర్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఈ నోడల్‌స్టోర్‌ అనేక గ్రామాల్లోని మహిళలకు ఆదాయ వనరుగా మారింది. ప్రస్తుతం కోటిన్నర రూపాయల టర్నోవర్‌తో దిగ్విజయంగా నడుస్తోంది. గతంలో వ్యాపారం నెలకు రూ.4 లక్షలతో కొనసాగుతుండగా ప్రస్తుతం మార్చి నెల లాక్‌డౌన్‌ నుండి వ్యాపారం జోరందుకొని రెట్టింపుగా మారింది. ప్రస్తుతం నెలకు రూ.6 లక్షల వరకు కొనసాగుతుందని బిజినెస్‌ మేనేజర్‌ తెలిపారు. ఈ స్టోర్‌లో ఐటీసీ, హిందుస్తాన్‌, గోద్రెజ్‌ తదితర ప్రముఖ కంపెనీల నుండి నాణ్యమైన వస్తువులను తెప్పించి ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకే విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో పొదుపు మహిళలు స్వయంగా చేపట్టిన తినుబండారాలు, ఇతర వస్తువులను విక్రయిస్తూ మహిళలకు చేయూత నిస్తున్నారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో అధికసంఖ్యలో పొదుపు మహిళలు నోడల్‌స్టోర్‌లో సభ్యులుగా చేరి వస్తువులు కొనుగోలు చేసుకొని వారి వారి గ్రామాల్లో  దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం మహిళల ఆర్ధికాభివృద్ది నిమిత్తం ఏర్పాటు చేసిన ఈ నోడల్‌స్టోర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉందని గ్రామాల్లోని పొదుపు గ్రూపుల మహిళలు తెలుపుతున్నారు.

Updated Date - 2021-12-27T05:21:57+05:30 IST