కుక్కలు, కోతులతో బెంబేలు

ABN , First Publish Date - 2021-05-31T05:25:37+05:30 IST

పొదిలి పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువైంది. దీంతో ప్రజలు వీధులలో తిరగాలంటేనే హడలిపోతున్నారు. అంతేగాకుండా పట్టణవాసులు కొంతమంది పెంపుడు కుక్కలు సైతం గొలుసుతో కట్టివేయకుండా వదలివేస్తున్నారు. వీటికి తోడు కోతుల స్వైరవిహారం చేస్తున్నాయి. ఇళ్లల్లో ఉన్న వస్తువులను పాడు చేయడమే కాకుండా అదిలిస్తే మహిళలపై విరుచుకుపడుతున్నాయి.

కుక్కలు, కోతులతో బెంబేలు
రోడ్లపై స్వైర విహారం చేస్తున్న కుక్కలు

 భయంతో హడలిపోతున్న ప్రజలు

పొదిలి, మే 30 : పొదిలి పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువైంది. దీంతో ప్రజలు వీధులలో తిరగాలంటేనే హడలిపోతున్నారు. అంతేగాకుండా పట్టణవాసులు కొంతమంది పెంపుడు కుక్కలు సైతం గొలుసుతో కట్టివేయకుండా వదలివేస్తున్నారు. వీటికి తోడు కోతుల స్వైరవిహారం చేస్తున్నాయి.  ఇళ్లల్లో ఉన్న వస్తువులను పాడు చేయడమే కాకుండా అదిలిస్తే మహిళలపై విరుచుకుపడుతున్నాయి. నగర పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయటకు రావాలంటే భయం 

  పట్టణంలో విశ్వనాథపురం, కాలేజిరోడ్డు, ప్రకాశ్‌నగర్‌, బస్టాండ్‌ కూడలి, సాయిబాబా వీధి, పాతూరులో ఇస్లాంపేట, గుదేటివారి వీధి, తాలుకా ఆఫీసువీధి, అమ్మవారిశాల బజారు తదితర ప్రాంతాలలో చీకటి పడిన తరువాత బయటకు రావాలంటే ఎక్కడ కుక్కలు కరుస్తాయోనని ప్రజలు ఆందోళన  చెందుతున్నారు. ఈసమస్యను పరిష్కరించండి మహాప్రభో అని నగరపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏవో కుంటి సాకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల మార్కాపురం అడ్డరోడ్డులో ఒకేసారి కుక్కలు ఐదారు మందిని గాయపరిచాయి. కుక్కకాటుకు గురై ప్రభుత్వ వైద్యశాలలో టీకాలు వేయించుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈఏడాది సుమారుగా కుక్కకాటు కేసులు 100కు పైగా నమోదయ్యాయి.

ఇళ్లచుట్టూ పందుల బెడద

పట్టణంలో పలు వీధులలో పందులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటి పెంపకం దారులకు హెచ్చరికలు చేసినప్పటికీ వారు వీధులలో వదలివేస్తున్నారు. దీంతో గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అధికారులు స్పందించి పందుల పెంపకం దారులతో మాట్లాడి పట్టణానికి దూరంగా పెంపకం చేసేలా చర్యలు తీసుకోవాలని, కుక్కలు, పందులు, కోతుల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-05-31T05:25:37+05:30 IST