రాష్ట్రంలో మూడో స్థానం
ABN , First Publish Date - 2021-07-08T07:14:51+05:30 IST
జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు జిల్లాల వారీగా పరిశీలిస్తే మన దగ్గరే అధికంగానే ఉంటున్నాయి.

తగ్గనంటున్న కొవిడ్, తాజాగా 375 నమోదు
ఆంక్షల సడలింపుతో మళ్లీ పెరుగుతున్న కేసులు
నేటి నుంచి థియేటర్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్‌కు అనుమతి
ఒంగోలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు జిల్లాల వారీగా పరిశీలిస్తే మన దగ్గరే అధికంగానే ఉంటున్నాయి. ఈ వారంలో ఒక్క రోజు మినహా మిగతా అన్ని రోజులు 300 లేదా ఆపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల పరిశీలిస్తే జిల్లాలో 375 కేసులు నమోదయ్యాయి. గరిష్ఠంగా కేసులు నమోదైన వాటిలో మూడవ స్థానంలో జిల్లా ఉంది. ఈ స్థాయిలో కేసులు రోజువారీ నమోదవుతున్నప్పటికీ నియంత్రణ వైపు యంత్రాంగం పెద్దగా దృష్టిసారించిన పరిస్థితి లేదు. రాత్రి 10 తర్వాత కర్ఫ్యూ వల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఆంక్షల సడలింపు సమయంలో జనం ఇష్టారీతిన తిరుగుతున్నారు. వ్యాపార సంస్థలు ఇతరచోట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇదిలా ఉండగా గురువారం నుంచి జిల్లాలో మరికొన్ని సడలింపులు అమలు కానున్నాయి. థియేటర్లు జిమ్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా వాటిని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ కరోనా ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తోంది.
375 పాజిటివ్‌లు
ఒంగోలు (కార్పొరేషన్/కలెక్టరేట్) జిల్లాలో కొత్తగా 375 కొవిడ్ పాజిటివ్‌లు నమోదయ్యాయి. కొత్తగా రెండు బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. దీంతో బుధవారం నాటికి మొత్తం ఫంగస్ కేసుల సంఖ్య 185కు చేరింది. ప్రస్తుతం 42 యాక్టివ్ కేసులు ఉండగా వారంతా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 80మంది డిశ్చార్జ్ కాగా, బుధవారం ఒక్కరోజే 16 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జిల్లాలో బుధవారం 70 కేంద్రాల్లో 2,216 మందికి టీకాలు వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రత్నావళి తెలిపారు. దీంతో ఇప్పటివరకూ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 11,57,669మందికి చేరిందని చెప్పారు.