జీవ వైవిధ్యం..నల్లమల సొంతం
ABN , First Publish Date - 2021-04-03T05:50:42+05:30 IST
ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలకు తలమానికంగా లక్షల హెక్టార్లలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా మారింది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో వేలాది జీవరాశులు సంచరిస్తున్నాయి. అటవీశాఖ చేపడుతున్న ప్రత్యేక రక్షణ చర్యలతో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. అడవులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా సుంచి పెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యంపై పలు పరిశోధనలు చేపట్టారు
అందమైన హరివిల్లు అటవీ ప్రాంతం
మూడు జిల్లాలకు ముచ్చటైన పచ్చలహారం
అరుదైన జీవజాతులకు నిలయం
పెద్ద దోర్నాల, ఏప్రిల్ 2: ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలకు తలమానికంగా లక్షల హెక్టార్లలో విస్తరించిన నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా మారింది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో వేలాది జీవరాశులు సంచరిస్తున్నాయి. అటవీశాఖ చేపడుతున్న ప్రత్యేక రక్షణ చర్యలతో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. అడవులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా సుంచి పెంటలోని బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయం కేంద్రంగా శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యంపై పలు పరిశోధనలు చేపట్టారు. ప్రధానంగా అంతరించి పోతున్న పులుల సంతతిపై దృష్టిసారిస్తున్నారు. ఈక్రమంలో అరుదైన జీవ జాతులను గుర్తిస్తున్నారు. నల్లమల అటవీప్రాంతం విశాలమైనది. ఈ ప్రాంతం అనేక జీవరాశులకు అందివచ్చిన వరం. పచ్చని పరిసరాలు, దట్టమైన చెట్లు, వివిధ జంతుజాలాలతో నిండి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ పరిధిలో 5,725 చదరపు కిలోమీటర్ల మేర కృష్ణానదికి దక్షిణం వైపున మంత్రాల కనుమ, నంది కనుమల గుండా సాగే అటవీ ప్రాంతాన్ని గుండ్ల బ్రహుహ్మేశ్వరం అభయారణ్యంగా ప్రకటించారు. ఈ ప్రాంతం అద్భుతమైన అందాల స్వర్గ సీమగా పేరుగాంచింది. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు విస్తరించి పచ్చలహారంగా విరాజిల్లుతోంది.
అటవీ శాఖ ప్రత్యేక చర్యలు
నల్లమల అడవిలో ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తుమ్మలబైలు సమీపంలో, రోళ్లపెంట వద్ద ఏకోటూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. తద్వారా యాత్రికులు అటవీ అందాలను తిలకిస్తూ ప్రకృతి అందించిన సంపదను సంరక్షించుకునేందుకు వీలుగా అవగాహన కల్పిస్తున్నారు.
నల్లమలలో కొత్త జీవరాశులు
నల్లమలలో లెక్కలేనన్ని జీవజాతులు నివశిస్తున్నాయి. వీటితో పాటు అనేక రకాల ఔషధ గుణాలున్న మొక్కలున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఉన్నాయి. వివిధ జాతుల క్రిమికీటకాలెన్నో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతలో కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. ఈ బయోడైవర్సిటీలో 2001 డిసెంబర్‌లో ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఆయా జాతులకు చెందిన పూర్తి వివరాలు పొందుపరిచారు. 2014-15లో మెటోక్రొమాటిస్ సైగ్రోఫి యొరేటో మారస్, శ్రీశైలం యొన్ఫిస్ (సాలీడు), నాగార్జునసాగర్ రేజర్ (పాము), కోరల్ స్నేక్ (పాము), ఫ్రీనికస్ ఆంధ్రాయొన్ఫిస్ (సాలీడు), నల్లమల యొన్ఫిస్ (సాలీడు), లాటిప్స్ (కీటకాలు), దారిస్తీన్ప్ రో స్ర్టాటస్ (గొల్లభామ) శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ స్యాండ్ స్నేక్, వీటితో పాటు కృష్ణానదిలో టూ స్పాటెన్ బాక్స్ అనే అరుదైన చేపను కూడా కనుగొన్నారు.
జీవ వైవిధ్యానికి జంతువులదే కీలకపాత్ర
ప్రకృతితో మానవుడి జీవితం ముడిపడిఉంది. నల్లమల అటవీ ప్రాంతం అనేక వృక్ష సంపద, రకరకాల జంతువులతో, పక్షులతో పర్యావరణం పరిఢవిల్లుతోంది. కాగా ప్రధానంగా ఈ పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణులదే అగ్రస్థానం. వేల కొద్దీ జింకలు నెమళ్లు, కుందేళ్లు, దుప్పులు, చిరుతలు, పెద్ద పులులు తదితరాల నల్లమల అందాల హరివిల్లుగా శోభిల్లుతోంది.


