దోపిడీ ముఠాలపై డీఐజీ సమీక్ష

ABN , First Publish Date - 2021-12-09T05:05:04+05:30 IST

దోపిడీ ముఠాలు రాష్ట్రంలో సంచరించడంతోపాటు పలుచోట్ల హత్యలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ బుధవారం తన కార్యాలయంలో రేంజ్‌ పరిధిలోని నలుగురు ఎస్పీలతో సమావేశమయ్యారు. మన జిల్లా నుంచి ఎస్పీ మలికగర్గ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల టంగుటూరు, ఇంకొల్లు మండలం పూసపాడుల్లో జరిగిన హత్యలు, దోపిడీలపై ఆయన సమీక్షించారు.

దోపిడీ ముఠాలపై డీఐజీ సమీక్ష

టంగుటూరు కేసులో ఆధారాల కోసం అన్వేషణ

ఒంగోలు (క్రైం), డిసెంబరు 8 : దోపిడీ ముఠాలు రాష్ట్రంలో సంచరించడంతోపాటు పలుచోట్ల  హత్యలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ బుధవారం తన కార్యాలయంలో రేంజ్‌ పరిధిలోని నలుగురు ఎస్పీలతో సమావేశమయ్యారు. మన జిల్లా నుంచి ఎస్పీ మలికగర్గ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల టంగుటూరు, ఇంకొల్లు మండలం పూసపాడుల్లో జరిగిన హత్యలు, దోపిడీలపై ఆయన సమీక్షించారు. 


టంగుటూరు కేసులో కనిపించని పురోగతి

టంగుటూరులో తల్లీకూతుళ్ల హత్య కేసుపై ఆరంభంలో కనిపించిన వేగం ఇప్పుడు తగ్గింది. సెల్‌ఫోన్‌ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులకు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడం విచారణకు ప్రతిబంధకంగా మారింది. అక్కడి నుంచి ఎలాంటి పురోగతి కన్పించడం లేదు. దీంతో  మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో ఉంటున్న వారిపై దృష్టి సారించారు. వారి వివరాలను సేకరించారు. గతంలో నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో రైల్వే ట్రాక్‌ పక్కన దోపిడీ ముఠా మకాం వేసి పరిసరప్రాంతాల్లో భయానక వాతవరణం సృష్టించింది. నిద్రపోతున్న వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి దోపిడీలకు పాల్పడింది. అప్పట్లో ఇలాగే గుడారాల్లో ఉన్న వారిని అనుమానించి ఆ గ్యాంగ్‌ను పట్టుకోగలిగారు. ఈసారి కూడా ఆవైపు దృష్టి సారించడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకొని కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 


సునిశిత దర్యాప్తు

టంగుటూరు కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎస్సీ మలికగర్గ్‌ ప్రతి రెండు గంటలకు ఒకసారి సమీక్ష  చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎలాంటి కీలకమైన ఆధారం దొరకలేదు. అదుపులో ఉన్న అనుమానితులను నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అన్నది గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.  Updated Date - 2021-12-09T05:05:04+05:30 IST