బిల్లు కట్టకపోతే విద్యుత్ కట్
ABN , First Publish Date - 2021-10-21T05:36:02+05:30 IST
విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే తక్షణమే కనెక్షన్‌ను తొలగించాలని ఆశాఖ సీఎండీ పద్మజనార్థన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

సీఎండీ పద్మజనార్దన్‌రెడ్డి
కనిగిరి, అక్టోబరు 20 : విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే తక్షణమే కనెక్షన్‌ను తొలగించాలని ఆశాఖ సీఎండీ పద్మజనార్థన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా సమస్యలపై పరిశీలనలో భాగంగా బుధవారం కనిగిరి విద్యుత్ డీఈ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు తమ పొలాల్లో మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించుకొనేందుకు 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రీవ్యాప్టింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడంలో భాగంగా 10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. అదే విధంగా పాత ట్రాన్స్ఫార్మర్ల మార్పు, విద్యుత్‌స్తంభాలు కొత్తవి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 33 కేవీ సబ్స్టేషన్స్, లైన్లు, స్తంభాలు పాతవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అతి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాలనీల వారికి రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు స్టేతో ప్రస్తుతం ట్రూఅప్ చార్జీలు నిలిపివేశామన్నారు. అదేవిధంగా వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురు 191, 192, 193 సర్వేనంబర్లలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని ఆక్రమించుకుని విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకున్నారని వాటిని తొలగించాలని నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సీఎండీకి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ వెంటనే ఆ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే తొలగించాలని కనిగిరి విద్యుత్‌శాఖ డీఈని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, డీఈ రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.