పరిహారమా.. పరిహాసమా...!

ABN , First Publish Date - 2021-11-29T04:27:09+05:30 IST

నకిలీ విత్తనాలు, దక్కని మద్దతు ధర, అధిక వడ్డీకి రుణాలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, వీటన్నింటికి తోడు పంటలు దెబ్బతిన్న సమయంలో పాలకుల నిర్ల క్ష్యం వెరసి రైతులు నిండా మునుగుతున్నారు. ఒకవైపు ప్రకృతి విపత్తులతో పంటలు తుడిచిపెట్టుకుపోయి తీవ్రంగా నష్టపోతుండగా, పరిహారం ఇచ్చే విషయంలోనూ అధికారయంత్రాంగం ఉదాసీన వైఖరి చూపుతోంది. అందుకు నివర్‌ తుఫాన్‌ సాయమే నిదర్శ నం.

పరిహారమా.. పరిహాసమా...!
పెద్దారవీడు మండలం గొబ్బూరులో నివర్‌ తుఫాన్‌ దెబ్బకు పూర్తిగా మునిగిన మిరప తోట(ఫైల్‌)


రైతులకు అందించే సాయం నామమాత్రమే

నిరుడు నిండా ముంచిన నివర్‌ తుఫాన్‌ 

రూ.87కోట్ల సాయంతో చేతులు దులుపుకొన్న ప్రభుత్వం

ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో అకాల వర్షాల పరిహారం ఊసే కరువు

తాజా వర్షాలతో కర్షకులకు కోలుకోలేని దెబ్బ

ప్రభుత్వం అందించే ఇన్‌పుట్‌ సబ్సిడీపైనే గంపెడాశలు

యంత్రాంగం ఉదాసీన వైఖరితో మరింత నష్టం


రైతులకు జరిగే నష్టానికి ప్రభుత్వం అందించే సాయానికి పొంతన ఉండటం లేదు. పైగా పరిహారం చెల్లింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని చూపుతోంది. ఇచ్చేదే అరకొర అయితే కొంతమందికి అసలు అందకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. గతేడాది నవంబర్‌లో నివర్‌ తుఫాన్‌ సృష్టించిన బీభత్సానికి జిల్లా రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. అప్పట్లో పంటలకు జరిగిన నష్టం రూ.300 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులే అంచనా వేశారు. కానీ తీరా ప్రభుత్వం  కేవలం రూ.87 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. అదీ నష్టపోయిన రైతులందరికీ ఇవ్వలేదు. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌ మాసాల్లో కురిసిన అకాల వర్షాలు సైతం జిల్లా రైతులకు నష్టాలను మిగిల్చాయి. దీనికి  సంబంధించి ఇప్పటివరకూ రైతులకు రూపాయి విడుదల కాలేదు. ఇటీవలి వరుస వాయుగుండాల ప్రభావంతో జిల్లాలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. దాదాపు రూ.450కోట్ల నష్టం జరగ్గా, ప్రభుత్వం ఏమేరకు ఆదుకుంటుందోనన్న సందేహం రైతులను వెంటాడుతోంది. 


ఒంగోలు (జడ్పీ), నవంబరు 28 : నకిలీ విత్తనాలు, దక్కని మద్దతు ధర, అధిక వడ్డీకి రుణాలు, పెరిగిన పెట్టుబడి ఖర్చులు, వీటన్నింటికి తోడు పంటలు దెబ్బతిన్న సమయంలో పాలకుల నిర్ల క్ష్యం వెరసి రైతులు నిండా మునుగుతున్నారు. ఒకవైపు ప్రకృతి విపత్తులతో పంటలు తుడిచిపెట్టుకుపోయి తీవ్రంగా నష్టపోతుండగా, పరిహారం ఇచ్చే విషయంలోనూ అధికారయంత్రాంగం ఉదాసీన వైఖరి చూపుతోంది. అందుకు నివర్‌ తుఫాన్‌ సాయమే నిదర్శ నం. ఆరుగాలం కష్టపడి పెంచుకున్న పంట ప్రకృతి ప్రకోపానికి కళ్లముందే నాశనమవుతుంటే రైతు తల్లడిల్లిపోతున్నాడు. ఎన్నిసార్లు పంటలు దెబ్బతిన్నా, ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా వీటన్నింటినీ దాటుకుని అన్నదాత సేద్యం చేస్తూనే ఉన్నాడు. పడుతూ లేస్తూ కాడి వదిలేయకుండా పొలాన్నే నమ్ముకుని బతుకీడిస్తున్నాడు. ప్రస్తుత వాయుగుండం ప్రభావంతో జిల్లాలో 1.01లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కేవలం రూ.20.42కోట్ల మేరకు నష్టం అనివారు చెబుతున్నా.. దీనిని మంజూరు చేసేనాటికి ప్రభుత్వం ఎంత కోత విధిస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి  రూ.450కోట్ల మేర నష్టం ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. 


గతేడాది నిండా ముంచిన నివర్‌

2020 నవంబర్‌ చివరి వారంలో వచ్చిన నివర్‌ తుఫాన్‌ జిల్లా రైతాంగానికి కన్నీటినే మిగిల్చింది. దాదాపు రూ.300 కోట్ల వరకు పంటలకు నష్టం వాటిల్లిందని, 1.06లక్షల హెక్టార్లకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ నివేదిక పంపింది. పరిహారం విడుదలైంది రూ.87కోట్లు మాత్రమే. 78,887 హెక్టార్లకుగాను 1,12,077 మంది రైతుల ఖాతాల్లో ఈ పరిహారాన్ని జమచేశారు. రెండో విడత మరికొందరికి అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించినా ఆ తర్వాత ఎవరికీ ఇవ్వలేదు.


ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో అకాల వర్షాలు

ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్‌ మాసాల్లో కురిసిన అకాలవర్షాలు సైతం పంటలను దెబ్బతీశాయి. ఫిబ్రవరిలో కురిసిన వర్షాలకు 761 హెక్టార్లకుగాను రూ.77లక్షల నష్టం వాటిల్లిందని, ఏప్రిల్‌కు సంబంధించి 196 హెక్టార్లకుగాను రూ.28లక్షలమేర రైతులు నష్టపోయారని యంత్రాంగం తేల్చింది. కేంద్రం గుర్తించిన విపత్తులకు మాత్రమే పరిహారం వర్తిస్తుందని ముక్తాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడంతో రైతాంగం మరోమారు వంచనకు గురైంది.


తాజా వర్షాలతో తీవ్రనష్టం

తాజాగా వారంరోజులపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు రైతాంగాని కి తీరని శోకాన్ని మిగిల్చాయి. ఖరీఫ్‌, రబీ రెం డు సీజన్లలో కలిపి వ్యవసాయ శాఖకు సంబంధించి 75,906.41 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 22,571మంది రైతులకు రూ.20.42 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఇక ఉద్యాన శాఖ, పొగాకు బోర్డు పరిధిలో జరిగిన నష్టం కలిపి 1.01లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారికి అంచనా. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంతో పోలిస్తే ఈ అంచనాలు చాలా స్వల్పం. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాబట్టి పరిహారం విడుదలయ్యే నాటికి ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయదని రైతాంగం కలవరపడుతోంది. గత నివర్‌ అనుభవాల్నే ఇందుకు అన్నదాతలు ఉదహరిస్తున్నారు.


రబీకి రాయితీ విత్తనాలతోనే సరి

తాజా వర్షాలతో రబీ సీజన్‌లో సాగు చేసి న శనగ, మినుముకు తీవ్రనష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 38,000 ఎకరాల్లో పైరు దెబ్బతిన్నట్లు అధికారిక అంచనాలు చెప్తుండగా  ఇది 50,000 ఎకరాలు వరకు ఉండొచ్చని సమాచారం. వీటికి సంబంధించి నష్టం అంచనాలను కూడా ప్రభుత్వానికి నివేదించ లేదు. రైతుల సంఖ్యను కూడా ప్రకటించ లేదు. మొక్కదశలోనే ఉన్నందున రాయితీ విత్తనాలతో సరిపెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎకరాకు రూ.20,000కుపైనే ఇప్పటికే రైతులు పెట్టుబడి పెట్టి ఉన్నారు. వీరికి కూడా నష్టపరిహారం అందించాల్సి ఉంది. మళ్లీ వర్షాలు మొదలవడంతో ఈ నష్టం అంచనాలు మరింత పెరిగే అవకాశముంది


నివర్‌ తుఫాన్‌ పరిహారం రూపాయి కూడా రాలేదు

నివర్‌ తుఫాన్‌ వల్ల బాగా నష్టపోయా. ఎకరన్నర మిర్చి పూర్తిగా దెబ్బతిన్నది. లక్షన్నరకుపైగా నష్టపోయా. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సహాయం అందలేదు. ఇప్పుడు వర్షాలతో మళ్లీ దెబ్బపడింది. కనీసం ఇప్పుడైనా పరిహారం అందించాలి

దమ్మాలపాటి సుబ్బారావు, ఇడుపులపాడు, ఇంకొల్లు మండలం


నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలి

నష్టపోయిన రైతులందర్నీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అసలే కరోనాతో చితికిపోయిన అన్నదాతలను ఈ వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని పరిహారం లెక్క కట్టాలి. రబీ రైతులకు రాయితీ విత్తనాలతోపాటు నగదు సాయం కూడా అందిస్తేనే మేలు జరుగుతుంది

మండవ శ్రీనివాసరావు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు


Updated Date - 2021-11-29T04:27:09+05:30 IST