కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-01-12T07:01:36+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

తొలి విడతలో 24వేల హెల్త్‌కేర్‌ సిబ్బందికి టీకా

జిల్లాలో 130  కేంద్రాల ఏర్పాటు


ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 11 : జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొదటి విడతలో 24వేల మంది హెల్త్‌కేర్‌ సిబ్బందికి వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో రెండువిడతలు డ్రైరన్‌ పూర్తిచేసిన అధికారులు వ్యాక్సిన్స్‌ వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై  సమావేశాలు నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ డేటాను కోవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. జిల్లాలో 130 కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా వ్యాక్సిన్‌ వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వ్యాక్సినేటింగ్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌నర్సు, మహిళా పోలీస్‌, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్త, డిజిటల్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రతి కేంద్రంలో వెయింటింగ్‌ రూం, వ్యాక్సినేషన్‌ రూం, అబ్జర్వేషన్‌ రూంలను ఏర్పాటు చేశారు. మహిళా పోలీసుల ద్వారా లబ్ధిదారుడిని గుర్తించి డేటా పరిశీలించిన అనంతరం డిజిటల్‌ అసిస్టెంట్‌ ఆ లబ్ధిదారుడిని సరిచూసిన తర్వాత వ్యాక్సిన్‌ వేస్తారు. తర్వాత అరగంట పాటు పరిశీలనలో ఉంచేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. వ్యాక్సిన్‌ కారణంగా ప్రతికూల పరిస్థితి ఎదురైతే వెంటనే వైద్యచికిత్స అందించేందుకు నిపుణులైన మెడికల్‌ ఆఫీసర్‌ కూడా ఉంటారు. ప్రతి మండలానికి 108వాహనం ద్వారా కొవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణా చేసేందుకు చర్యలు చేపట్టారు. కాగా రెండో విడతలో పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లోని సిబ్బంది, మునిసిపాలిటీ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. రెండో విడతలో 30వేల నుంచి 35వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్దేశించారు. వారి డేటాను కూడా సిద్ధం చేస్తున్నారు. మూడో విడతలో 50ఏళ్లకు పైబడిన వారితో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2021-01-12T07:01:36+05:30 IST