చిన్నారులపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-08-27T05:44:31+05:30 IST

మండలంలోని వీరేపల్లి అప్పర్‌ ప్రైమరి స్కూల్లోని నలుగురు విద్యార్థినీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

చిన్నారులపై కరోనా పంజా
వీరేశ్వరం ప్రాథమికోన్నత పాఠశాల

నిన్నమొన్నటి వరకు వృద్ధులు, పెద్దలపై తన ప్రతాపం చూపిన కరోనా నేడు విద్యార్థులపై పంజా విసురుతోంది. రెండు వేర్వేరు పాఠశాల్లో  నిర్వహించిన కరోనా పరీక్షల్లో తొమ్మిదిమంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ కాగా, ఆయా గ్రామాల్లోనూ కరోనా విస్తృతి అధికంగా ఉంది. అధికారులు అప్రమత్తమై ముందుస్తు చర్యలు తీసుకోకపోతే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంది.

వీరేపల్లి(ఉలవపాడు), ఆగస్టు 26 : మండలంలోని వీరేపల్లి అప్పర్‌ ప్రైమరి స్కూల్లోని నలుగురు విద్యార్థినీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మూడు రోజుల క్రితం స్థానిక ఏఎన్‌ఎంలు పాఠశాలలో ఎంపిక చేసిన 40 మంది విద్యార్థుల నుంచి శ్యాబ్‌ సేకరించి పరీక్షలు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు కే.శ్రీదేవి తెలిపారు. వీరిలో నలుగురు బాలికలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.  వీరంతా గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలకు చెందిన విద్యార్థులు. దీంతో గురువారం పాఠశాలకు విద్యార్థులు హాజరుకాలేదు. ఇక గ్రామంలో ఇంచుమించు 30 మంది వరకు కరోనా లక్షణాలున్న వారు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయినప్పటికీ, గ్రామంలో కొవిడ్‌ నిబంధనలు అమలుకావడం లేదు.

పంచాయతీ పాలకవర్గంలోని సభ్యులను కూడా కరోనా వదల్లేదు. వీరేపల్లి సర్పంచ్‌ కాకర్లపూడి సుధారాణి తండ్రి గురువారం ఉదయం కరోనా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మాజీ సర్పంచ్‌ లక్కంరాజు గోపాలకృష్ణంరాజు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఉపసర్పంచ్‌ నున్నం పోతురాజు కరోనా నుంచి ఇటీవల కోలుకున్నాడు. పలువురు ప్రస్తుత, మాజీ వార్డు సభ్యులు కూడా కరోనాబారిన పడ్డారు. కరోనా మూడవ దశ పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెప్తున్న విషయం తెలిసిందే.  పైగా నలుగురు బాలికలకు కరోనా సోకిందని ఆరోగ్య సిబ్బంది నిర్దారించారు. అయినప్పటికీ, గ్రామంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేకశ్రద్ధ చూపిన దాఖలాలు లేవు.

ఐదుగురు విద్యార్థులకు కరోనా

వెలిగండ్ల : మండలంలోని వెదుళ్లచెరువు ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో కలకలం రేగింది. పాఠశాలకు విద్యార్థులను పంపించే ముందు తల్లిదండ్రులు, కరోనా పరీక్షలు చేయమని ఉపాధ్యాయులు కోరారు. అప్పటికే పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. పాఠశాలలో మొత్తం 23 మంది విద్యార్థులుండగా బుధవారం 15 మంది విద్యార్థులకు వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించగా, గురువారం ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ణారణ అయింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. నివేదికలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో మిగతా విద్యార్థులకు కూడ కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా సోకిన విద్యార్థులను హోం క్వారంటైన్‌కు పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

అధికారులు అప్రమత్తం అయితేనే...

ప్రస్తుతం కేసుల విస్తర్ణ రానున్న మూడోదశను ముందుగానే సూచించినట్లు పరిస్థితి ఉంది. అధికారులు ముందుగానే అప్రమత్తం కాకుండా నష్టం తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. వెంటనే ఆరోగ్య సిబ్బంది కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అప్రమత్తమై.. నివారణ చర్యలు ఇంటింటి సర్వే చేసి వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-27T05:44:31+05:30 IST