పెట్రో మంటపై ఆందోళన
ABN , First Publish Date - 2021-10-29T05:47:21+05:30 IST
అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పెరుగుతున్న పెట్రో, గ్యాస్ ఇతర వస్తువుల ధరలు నిరసిస్తూ వామపక్షాల దేశవ్యాప్త పిలుపుమేరకు జిల్లాలో గురువారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారు. కొన్నిచోట్ల లారీలు, ఆటోలు వంటి వాహనాలను తాళ్ళతో కట్టి లాగి నిరసన తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నాలుగు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
జిల్లావ్యాప్తంగా వామపక్షాల నిరసనలు
ప్రభుత్వాల విధానాలతోనే ధరలు పెరుగుదల విమర్శ
తక్షణం పెట్రో ధరలు నియంత్రణకు డిమాండ్
ఒంగోలు(కలెక్టరేట్), అక్టోబరు 28: అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలకు కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని వామపక్ష నాయకులు ధ్వజమెత్తారు. పెరుగుతున్న పెట్రో, గ్యాస్ ఇతర వస్తువుల ధరలు నిరసిస్తూ వామపక్షాల దేశవ్యాప్త పిలుపుమేరకు జిల్లాలో గురువారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో సీపీఐ, సీపీఎం ఇతర వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారు. కొన్నిచోట్ల లారీలు, ఆటోలు వంటి వాహనాలను తాళ్ళతో కట్టి లాగి నిరసన తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద నాలుగు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆయా పార్టీల జిల్లా నాయకులు ఎంఎల్ నారాయణ, పూనాటి ఆంజనేయులు, లలితకుమారి పాల్గొన్నారు. అలాగే మార్కాపురం, అద్దంకి, దర్శి, వైపాలెం, చీమకుర్తి, కందుకూరు, పామూరు, పొదిలి, కొండపిలతోపాటు మద్దిపాడు, దొనకొండ, ముండ్లమూరు, దోర్నాల, కేకేమిట్ల, పుల్లలచెరువు పలు ఇతర మండల కేంద్రాల్లోనూ ఆందోళనలు చేపట్టారు. మద్దిపాడులో వామపక్షాల కార్యకర్తలు లారీకి తాళ్లు కట్టి లాగి నిరసన తెలుపగా, చీమకుర్తిలో ఆటోను తాళ్ళతో లాగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెట్రోలు, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండటంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రో ధరలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల విషయంలో ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని కోరారు.