పరిహారం జమయ్యేదెన్నడో..!

ABN , First Publish Date - 2021-01-12T07:25:05+05:30 IST

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం రూపంలో ఊరట ప్రకటించినా, పెద్దారవీడులో మాత్రం రైతుల ఖాతాలకు ఆ సొమ్ము చేరలేదు.

పరిహారం జమయ్యేదెన్నడో..!
వ్యవసాయశాఖ కార్యాలయం

పెద్దరావీడులో రైతుల ఖాతాల్లో జమకాని నష్టపరిహారం 

అధికారుల చేతివాటంపై అనుమానాలు 

సాంకేతిక సమస్యలంటున్న అధికారులు

పెద్దారవీడు, జనవరి 11 : పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం రూపంలో ఊరట ప్రకటించినా, పెద్దారవీడులో మాత్రం రైతుల ఖాతాలకు ఆ సొమ్ము చేరలేదు. పరిహారం అందకపోవడానికి సాంకేతిక సమస్యలు కారణమా..? లేక క్షేత్రస్థాయిలో ఎవరైనా అధికారులు చేతివాటం ప్రదర్శించారా...? అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

 మండలంలో నివర్‌ తుఫానుకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఊరటను కల్పించింది. ఈ నేపథ్యంలో పెద్దారవీడు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి పత్తి మిరప, కూరగాయల పంటలు అధికారులు పరిశీలించి అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు. ఆ నివేధికలను ఉన్నతాధికారులకు సైతం పంపించారు. ఈ నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు కొద్దోగొప్పో పరిహారం గతేడాది డిసెంబరు 29నే రైతుల ఖాతాల్లో జమైంది. అయితే పెద్దారవీడు గ్రామంలో సాగుచేసిన వివిధ పంటలకు రైతులకు ఖాతాల్లో నేటికీ జమకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిహారం నిలిచిపోవడానికి కారణమేమిటనేది రైతులకు అర్థంకాని పరిస్థితి నెలకొంది.

పెద్దారవీడు గ్రామంలో పత్తి 503 హెక్టార్లు కూరగాయలు, 104 హెక్టార్లలో సాగు చేశారు.  ఈ పంటలు నివర్‌ తుఫానుకు దెబ్బతిన్నాయి. దాదాపుగా 489 మంది రైతులకు రూ.83 లక్షల  పరిహారం చెల్లించాల్సి ఉంది.  అయితే అన్ని గ్రామాల రైతులకు పరిహారం జమ అయినప్పటికీ పెద్దారవీడు గ్రామ రైతులకు నేటికీ జమ కాలేదు.  దీంతో గ్రామంలోని ఉన్న రైతులు వ్యవసాయ, రైతుభరోసా కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అయితే ఎందుకు జమకాలేదో కనీసం కారణం కూడా తెలియక పోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  వ్యవసాయ శాఖ రిలీజ్‌ చేసిన వెబ్‌సైట్‌ లో కూడా రైతులు తమ ఆధార్‌నంబర్‌ ఎంటర్‌ చేసి నష్టపరిహారం రాలేదని చూస్తుండగా, ‘నో డేటా’ అని వస్తోందని రైతులు చెబుతున్నారు. సమీప మండలంలో ఇలానే నష్టపరిహారాన్ని ఎంపీఈవోలు గోల్‌మాల్‌ చేసిన ఉదాహరణలు ఉండడంతో ఇక్కడ కూడా అలాంటిదేమైనా జరిగి ఉంటుందా...? అని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని రైతులకు రావాల్సిన నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-01-12T07:25:05+05:30 IST