రాజకీయ ఒత్తిళ్లతోనే కలెక్టర్‌ బదిలీ

ABN , First Publish Date - 2021-05-30T07:16:13+05:30 IST

ఉద్యోగులు, ప్రత్యేకించి అధికారుల బదిలీలకు ఒక సమయం, సందర్భం ఉంటుంది. సాధారణ కాలపరిమితి తీరటం లేక అత్యవసర పాలనాపరమైన సమస్యలు వచ్చినప్పుడు అధికారులను బదిలీ చేయటం సహజం. కానీ జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆకస్మిక బదిలీకి ఇవేవీ ప్రత్యేక కారణాలుగా కనిపించటం లేదు.

రాజకీయ ఒత్తిళ్లతోనే కలెక్టర్‌ బదిలీ
బదిలలీ అయిన కలెక్టర్‌ భాస్కర్‌, నూతన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం

మంత్రి బాలినేని సీఎంను కలిసిన వారం రోజులకే.. 

ప్రజాప్రతినిధులను పక్కనబెట్టడం,  నిలకడలేని నిర్ణయాలు కూడా కారణ ం

పాలనలో అనుభవం ఉన్న కొత్త కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉద్యోగులు, ప్రత్యేకించి అధికారుల బదిలీలకు ఒక సమయం, సందర్భం ఉంటుంది. సాధారణ  కాలపరిమితి తీరటం లేక అత్యవసర పాలనాపరమైన సమస్యలు వచ్చినప్పుడు అధికారులను బదిలీ చేయటం సహజం. కానీ జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆకస్మిక బదిలీకి ఇవేవీ ప్రత్యేక కారణాలుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్‌గా ఉన్న వారిలో భాస్కర్‌ ఒక్కరే బదిలీ కావటం, అందునా కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్న సమయంలో ఇది జరగడం వివాదాస్పదమైంది. అలాగే ఇటీవల కలెక్టర్‌కి ఫోన్‌ చేయటం మానేసి తన అసంతృప్తిని తెలియజేస్తున్న జిల్లాకు చెందిన మంత్రి బాలినేని సీఎం జగన్‌ని కలిసిన వారం రోజులకే ఈ బదిలీ జరగడం గమనార్హం. దీంతో మొత్తం పరిస్థితిని సమీక్షిస్తే కలెక్టర్‌ భాస్కర్‌ని రాజకీయ ఒత్తిడితోనే ఆకస్మికంగా బదిలీ చేశారనే విషయం తేటతెల్లమవుతోంది. అయితే జిల్లాకు రానున్న కొత్త కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌కి పాలనలో మంచి అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో రెండేళ్ల పదవీకాలం ముగిసిన కలెక్టర్‌గా ఒకేచోట పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అంతకుమించి ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా నివారణ చర్యల్లో కీలకపాత్ర పోషిస్తున్న కలెక్టర్ల బదిలీలకు ప్రభుత్వం సహజంగానే సాహసించదు. కానీ ఆకస్మికంగా కలెక్టర్‌ భాస్కర్‌ని బదిలీ చేసి ఆయన స్థానంలో టూరిజం శాఖ ఎండీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ని ప్రభుత్వం నియమించింది. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా సీఎంకి ఫిర్యాదు చేసినందునే బదిలీ జరిగిందని భావిస్తున్నారు. కలెక్టర్‌ వ్యవహారశైలికి సంబంధించి పలు విషయాలను ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అధికారపార్టీ నేతల రాజకీయ సిఫార్సే భాస్కర్‌ బదిలీకి కారణమన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. 


భాస్కర్‌పై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల్లో అసంతృప్తి

నిజానికి కలెక్టర్‌  పోలా భాస్కర్‌ రోజులో ఎక్కువ సమయం విధి నిర్వహణకే ప్రాధాన్యమిస్తారు. అయితే అవసరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులను కలుపుకొనిపోరు. ఈ విషయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లంతా  అసంతృప్తితో ఉన్నారు. అదేసమయంలో మంత్రులు బాలినేని, సురేష్‌లకు టచ్‌లో ఉండటానికి ఆయన ప్రాధాన్యమిచ్చారు. కిందిస్థాయిలోని కొన్నిశాఖల  అధికారుల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల సిఫార్సులను గౌరవించారు. అయితే ఫైళ్ల క్లియరెన్స్‌లో తీవ్ర జాప్యం నెలకొంది. ఇతర అంశాలకొస్తే ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి సంక్షేమ పథకాల అమలులో ముందున్నారు. కానీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిపోయారని చెప్పుకోవచ్చు. వెలుగొండ నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. నివాస స్థల పట్టాల పంపిణీ వ్యవహారంలో కలెక్టరు వ్యవహారశైలిపై మంత్రి బాలినేని అసహనానికి గురయ్యారు. ఇక కందుకూరు ఎమ్మెల్యే మహీధర రెడ్డి ఏడాదిన్నర నుంచి కలెక్టర్‌ పాలనా తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  


కేర్‌ సెంటర్ల ఏర్పాటు, భోజన కాంట్రాక్టు మార్పుపై ఆగ్రహం

కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు సమయంలో ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకునేందుకు పరిస్థితికి అనుగుణంగా కలెక్టర్‌వ్యవహరించారు. కానీ తమ పాత్రను తగ్గించి వేశారని చాలామంది ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు. కొందరైతే నేరుగా మంత్రి బాలినేనికి ఫిర్యాదు కూడా చేశారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుతోపాటు రిమ్స్‌లో బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసే కాంట్రాక్టరు మార్పు కూడా అధికారపార్టీ నాయకులకు ఆగ్రహాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మంత్రి సిఫార్సు చేసిన వ్యక్తులను కూడా పక్కనబెట్టి కలెక్టర్‌ తనకు ఇష్టమైన పంథాలో ముందుకుపోయారు. బాధితులకు సరైన భోజనం అందించటమే తన లక్ష్యం అని కలెక్టరు అంటుంటే ఉన్నంతలో మేం చెప్పిన వారితోనే పనిచేయించుకోవాలని అధికారపార్టీ నాయకులు అంటుండటం గమనార్హం. ఒంగోలు రిమ్స్‌ అభివృద్ధికి మంత్రి బాలినేని వైద్యశాఖ మంత్రితో మాట్లాడి ఒక ప్రణాళికను రూపొందిస్తే ఆ విషయాన్ని వారికంటే ముందు కలెక్టరే ప్రకటించారు. నిన్నటికి నిన్న మార్కాపురం మెడికల్‌ కాలేజీ శంకుస్థాపనకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే స్థానిక లేక జిల్లా ప్రజాప్రతినిధులు ప్రకటించే లోపే ఆయన ప్రకటన చేసి కార్యక్రమ ఏర్పాటుకి పరుగులు తీశారు. రాజకీయంగా పార్టీకి లేక పార్టీ నేతల మైలేజీని పెంచే ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని మంత్రి బాలినేని ముఖ్యమంత్రికి గట్టిగా చెప్పినందునే ఈ బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే కరోనా ఉధృతి నివారణ  చర్యల్లో కీలకపాత్ర కలెక్టరు పోషిస్తున్న సమయంలో ఆయనను ఆకస్మికంగా బదిలీ చేయించటం అటు యంత్రాంగంలోనూ, ఇటు ప్రజానీకంలోనూ అసంతృప్తిని రేకెత్తించింది. 


Updated Date - 2021-05-30T07:16:13+05:30 IST