సహకార వ్యవస్థ పటిష్టతతోనే రైతులకు మేలు

ABN , First Publish Date - 2021-03-22T06:31:04+05:30 IST

సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని సంగం డెయిరీ చైర్మెన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు.

సహకార వ్యవస్థ పటిష్టతతోనే రైతులకు మేలు
రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న నరేంద్రకుమార్‌

సంఘం డెయిరీ యూనిట్‌ ప్రారంభోత్సవంలో దూళ్లిపాళ్ల

దర్శి, మార్చి 21 : సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని సంగం డెయిరీ చైర్మెన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కొత్తరెడ్డిపాలెం వద్ద సంగం డెయిరీ నూతన యూనిట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులను ఉద్దేశించి నరేంద్రకుమార్‌ మాట్లాడారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా సంగం డెయిరీ పనిచేస్తూ అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదుగుతుందన్నారు. డెయిరీ ద్వారా వచ్చే లాభాలను రైతులకు పంచుతున్న ఏకైక సంస్థ సంగం డెయిరీ అన్నారు. ఒంగోలు డెయిరీ దెబ్బతినడం వలన జిల్లాలో పాడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రైతులకు తమవంతు సహకారం అందించేందుకు ప్రకాశం జిల్లాలో పలుచోట్ల పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆదీనంలో కొనసాగుతున్న  డెయిరీలను పట్టించుకోకుండా గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీని ఇక్కడకు తెచ్చిందన్నారు. అమూల్‌ డెయిరీకి ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న సహకారం ఒంగోలు డెయిరీకి అందిస్తే రైతులకు ఎంతో మేలు జరిగేదన్నారు. గుంటూరు జిల్లా రైతులతో పాటు ఇతర జిల్లాల రైతులకు కూడా సంగం డెయిరీలో వచ్చిన లాభాలు పంచి అందరినీ సమాన దృష్టిలో చూస్తామన్నారు. రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు.  కార్యక్రమంలో సంగం డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణణ్‌, డైరెక్టర్లు నర్రా వెంకటకృష్ణప్రసాదు, గోగినేని.ధనుంజయరావు, వి.ధర్మారావు, వి.రామారావు, ఎస్‌.వెంకటేశ్వరరావు, దర్శి, మర్రిపూడి మాజీ ఎంపీపీలు ఫణిదపు వెంకటరామయ్య, యర్రమోతు శ్రీనివాసరావు వివిధ గ్రామాల పాడి రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T06:31:04+05:30 IST