భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పర్వదినం
ABN , First Publish Date - 2021-12-26T06:28:05+05:30 IST
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక దుర్గం బాప్టిస్టు చర్చిలో క్రైస్తవులు శనివారం విశేష ప్రార్థనలు చేశారు.

కనిగిరి, డిసెంబరు 25: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని స్థానిక దుర్గం బాప్టిస్టు చర్చిలో క్రైస్తవులు శనివారం విశేష ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్దనా గీతాలు ఆలపించారు. హైదరాబాద్‌కు చెందిన ఏసీటీసీ రేవరెండ్ డాక్టర్ జాన్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చర్చి పాదర్ రెవరెండ్ డాక్టర్ వి.ప్రభు మనోహర్‌దాస్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో రేవ రెండ్ కేసీహెచ్ ధామస్, దుర్గం బాప్టిస్టు చైర్మన్ గంగా విద్యాసాగర్, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, మాజీ దుర్గం బాప్టిస్టు చైర్మన్ జక్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి : ఏసుక్రీస్తు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలోని 20వ వార్డులో శనివారం రాత్రి క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ కేక్‌ను కట్‌చేశారు. లోకానికి క్రీస్తు సందేశం ఆవశ్యకతను వివరించారు. క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలన్నారు.ఆయన వెంట నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షులు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు యాదవ్, టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్, బుల్లా బాలబాబు, సుంకర వేణు, జిలాని, నరసింహా, ఇలియాజ్, క్రైస్తవులు పాల్గొన్నారు.
పామూరులో: మండలంలోని వివిధ గ్రామాల్లోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. విద్యుత్ కాంతులు మిరమిట్లు గొలిపే విధంగా చర్చిలను అలంకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగసాని లక్ష్మీ, సింగిల్‌విండో చైర్మన్ పువ్వాడి వెంకటసుజాతలు శుభాకాంక్షలు తెలిపారు.
దొనకొండ : మండలంలోని అన్నీ గ్రామాల్లో ఆదివారం క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. దొనకొండలోని ఆర్‌సీఎం, ఏబీఎం, లూతరన్, సీఎస్‌ఐ తదితర చర్చీల్లో శనివారం అర్ధరాత్రి నుండే క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు ధానధర్మాలు చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
దర్శి : మండలంలో క్రిస్మస్ వేడుకలను శనివారం క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చ్‌లలో క్రీస్తు శాంతి సందేశాన్ని పాస్లర్లు భక్తులకు వివరించారు.
తాళ్లూరు : మండలంలోని మాధవరం గ్రామంలోని సెవంత్‌డే చర్చినందు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎస్సై బి.నరసింహారావులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు జరిపి క్రిస్మ్‌సకేట్‌కట్ చేసి స్వీట్లు పంచారు.
ముండ్లమూరు : మండలంలోని పెద్దఉల్లగల్లులోని తెలుగు బాపిస్టు చర్చిలో పాస్టర్లు డేవిడ్ ఆర్సన్, క్రాంతికుమార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా 50 కిలోల కేకును కెనరా బ్యాంకు మేనేజర్ డి సురేష్ కట్ చేశారు. మండల కేంద్రమైన ముండ్లమూరుతో పాటు పలు గ్రామాల్లో వేడకలు జరిగాయి. పాస్లర్లు యేసుదాసు, గండి బెంజిమెన్, కృపానందం, ఇర్మియ, బాబులు క్రీస్తు సందేశాన్ని వినిపిం చారు. మండలంలోని పెద్దఉల్లగల్లు ఎస్సీకాలనీ, కాలనీలకు చెందిన 40 మంది పేదలకు రూ.30వేలు విలువైన దుస్తులను రెడ్డినగర్ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మేడగం వెంకటరమణారెడ్డి శనివారం అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్‌జనమాల నాగేంద్రం, మాజీ సర్పంచ్ గొంది వెంకటప్పారెడ్డి, వలేటి సుబ్బారావు, కాలనీవాసులు పాల్గొన్నారు.
ఫ కురిచేడు : స్థానిక తెలుగు బాప్టిస్టు చర్చి, ఆర్‌సీఎం చర్చి, లూధియానా చర్చి, రోహ్ని ప్రార్ధనా మందిరాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రార్ధనలలో పాల్గొన్నారు.కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కందుకూరు : క్రిస్మస్ పర్వదిన వేడుకలను క్రైస్తవులు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రైస్తవులు కుటుంబసమేతంగా చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని జెడిబియం టౌన్ చర్చితోపాటు విలియంకేరి చర్చి, ప్రకాశం కాలని, ఆదిఆంధ్రకాలని, ప్రశాంతికాలని, కనిగిరి రోడ్డు, ఉప్పుచెరువు, బృందావనం తదితర ప్రాంతాలలో ఉన్న చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గుడ్లూరు : క్రిస్మస్ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో చర్చిలు భక్తులతో కళకళలాడాయి. గుడ్లూరు ఎస్టీ కాలనీలోని ప్రధాన చర్చిలో క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. కొత్తపేట, చెంచిరెడ్డిపాలెం, గుడ్లూరు ప్రధాన చర్చిలలో ప్రార్థనల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మిట్టపాలెంకు చెందిన మల్లిశెట్టి ఏసుబాబు, సాధినేని హరిబాబు నేతృత్వంలో వృద్దులకు, వికలాంగులకు దుస్తులు, పండ్లుఫలాలు అందజేశారు. అడవిరాజుపాలెం చర్చఫాస్టర్ ఆంద్రయ్య నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
లింగసముద్రం : క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు వేకువజామున 4 గంటల నుంచే చర్చిలలో ప్రార్ధనలు నిర్వహించారు. చిన్నా, పెద్దా, యువతీ యువకులు స్నానాలు చేసి నూతన వస్త్రాలను ధరించి చర్చిలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తుపుట్టుక గురించి భక్తులకు సందేశమిచ్చారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో క్రిస్మస్ పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.