అస్తవ్యప్తంగా సాగునీటి పంపిణీ
ABN , First Publish Date - 2021-10-25T06:19:31+05:30 IST
సాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చివరి ప్రాంతాలకు నీరు అందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు.

చివరి భూములకు అందని నీరు
ఎక్కువ వినియోగిస్తున్న ఎగువ ప్రాంత రైతులు
ఆరుతడులకు దక్కని భరోసా
దర్శి, అక్టోబరు 24 : సాగునీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చివరి ప్రాంతాలకు నీరు అందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. సాగర్ ఆయకట్టు చివరి భూముల్లో అటు వరి కానీ, మెట్ట పైర్లు కానీ సాగుచేయలేదు. దీంతో పొలాలు బీడుగా ఉన్నాయి. ఎగువ ప్రాంత రైతులు అధికంగా నీటిని వాడుకోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ లోపం వలన అన్నీ ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరడం లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం సాగర్ కాలువలకు విడుదల అవుతున్న నీటి పరిమాణం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సాగర్ కుడి కాలువకు డ్యాం నుంచి 9767 క్యూసెక్కుల నీరు బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుండి 8400 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేస్తున్నారు. ఆ నీటిని గుంటూరు బ్రాంచ్ కాలువకు 2200 క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్ కాలువకు 1583 క్యూసెక్కులు, సాగర్ ప్రదాన కాలువ 85/3 మైలుకు (ప్రకాశం బార్డర్)2269 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. జిల్లాకు విడుదల అయిన నీటిని పమిడిపాడు బ్రాంచ్ కాలువకు 546 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాలువకు 505 క్యూసెక్కుల నీరు పంపిణీ చేస్తున్నారు.
అధికనీరు వాడుకుంటున్న ఎగువ ప్రాంత రైతులు
జిల్లాకు విడుదలైన నీటిలో అధికశాతం ఎగువ ప్రాంత రైతులు వాడుకుంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దర్శి ఎన్‌ఎ్‌సపీ డివిజన్ పరిధిలో లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. దర్శి డివిజన్‌లోని మేజర్లకు 1750 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. చీమకుర్తి డివిజన్ పరిధిలో 1.70 లక్షల ఆయకట్టు భూమి ఉంది. చీమకుర్తి డివిజన్ పరిధిలోని మేజర్లకు కేవలం 505 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. చీమకుర్తి డివిజన్ పరిధిలోని 1.70 లక్షల ఆయకట్టు భూమి చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్ కాలువ పరిధిలో ఉంది. ప్రస్తుతం ఓబీసీకి కేవలం 505 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అనేక మేజర్లు, మైనర్లకు నీరు అందడం లేదు. ఒబిసీలో 1000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తేనే అన్నీ మేజర్లకు నీరు అందుతుంది. ఈ విషయం ఎన్‌ఎ్‌సపీ అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ చివరి ప్రాంతంలోని ఆయకట్టు భూములకు నీరు అందించే విషయంలో నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ వేలాది ఎకరాల ఆయకట్టు భూమి బీడుగా ఉంది. కనీసం ఆరుతడి పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా ఒంగోలు బ్రాంచ్ కాలువకు నీటి పరిమాణం పెంచి అన్నీ మేజర్లకు నీరు అందేలా అధికారులు చర్యలుతీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.