సెల్‌ పోయిందా.. భయం లేదు!

ABN , First Publish Date - 2021-11-26T05:32:12+05:30 IST

ఇకపై పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. పోలీసు స్టేషన్‌లో తక్షణమే ఫిర్యాదు స్వీకరించడంతో పాటుగా అందుకు రసీదు ఇచ్చే విధంగా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఎస్పీ మలిక గర్గ్‌. అంతే కాదు అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రొఫార్మ తయారు చేయించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొబైల్‌ ఫోన్‌ను కనిపెట్టి బాధితులకు అందజేసే విఽధంగా చర్యలు తీసుకోబోతున్నారు.

సెల్‌ పోయిందా.. భయం లేదు!

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వండి

వెంటనే రసీదు ఇస్తారు.. సాంకేతికతతో పట్టేస్తారు

నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఎస్పీ

ఒంగోలు(క్రైం), నవంబరు 25 : ఇకపై పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ గురించి గాబరా పడాల్సిన అవసరం లేదు. పోలీసు స్టేషన్‌లో తక్షణమే ఫిర్యాదు స్వీకరించడంతో పాటుగా  అందుకు  రసీదు ఇచ్చే విధంగా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఎస్పీ మలిక గర్గ్‌. అంతే కాదు అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రొఫార్మ  తయారు చేయించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొబైల్‌ ఫోన్‌ను కనిపెట్టి బాధితులకు అందజేసే విఽధంగా చర్యలు తీసుకోబోతున్నారు. గతంలో మొబైల్‌ పోగొట్టుకుంటే స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గగనమయ్యేది. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు పడకుండా ఎస్పీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. సామాన్యులు సైతం ఎలాంటి ఇబ్బంది పడకూడదని పోలీసు స్టేషన్లలో సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వారి కోసం దరఖాస్తును అందుబాటులోకి తెచ్చారు. 

దరఖాస్తు ఇలా..

సెల్‌ఫోన్‌ మిస్‌ అయినా, ఎవరైనా దొంగిలించినా వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లాలి. అక్కడ రిసెప్షన్‌లో ఉన్నవారికి తాను ఫోన్‌ పోగొట్టుకున్నానని, ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చానని తెలియజేయాలి. వెంటనే అక్కడి వారు ఒక దరఖాస్తును అందజేస్తారు. దానిలో తన చిరునామాతో పాటుగా సెల్‌ఫోన్‌ వివరాలు( ఐఎంఈఐ ఫోన్‌ నంబరు), ఎప్పుడు, ఎక్కడ పోయింది అనే వివరాలను పొందు పరచాలి. అనంతరం రిసెప్షన్‌లో దరఖాస్తును అందజేస్తే వెంటనే రసీదు ఇస్తారు.

సెల్‌ఫోన్‌ ట్రేసింగ్‌

దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఐటీ కోర్‌ టీమ్‌కు పంపుతారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు ఫోన్‌ను ట్రేస్‌ చేస్తారు. తద్వారా ఫోన్‌ వివరాలు తెలిసిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపుతారు. అనంతరం ఆ ఫోన్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేస్తారు.

ప్రజలకు మెరుగైన సేవలు: ఎస్పీ

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జిల్లా పోలీసు శాఖ ముందు ఉంటుందని ఎస్పీ మలిక గర్గ్‌ తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాస్తవ ఫిర్యాదులను ఇవ్వాలని కోరారు. వాట్సాప్‌ నంబరు 9121102266కు కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. సామాన్యులు సైతం ఫోన్లు పొగొట్టుకొని ఆర్థికంగా నష్టపోతున్నారని, అందుకోసం నూతన ప్రక్రియను ఏర్పాటు చేశామని వివరించారు.


Updated Date - 2021-11-26T05:32:12+05:30 IST