కంభంలో సిమెంట్‌ రోడ్లు అధ్వానం

ABN , First Publish Date - 2021-10-08T05:22:49+05:30 IST

కంభం, కందులాపురం మేజర్‌ పంచాయతీల్లోని పలు ప్రధాన సిమెంట్‌రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

కంభంలో సిమెంట్‌ రోడ్లు  అధ్వానం
బీటలువాలిన సిమెంట్‌ రోడ్డు

నాసిరకంగా నిర్మాణం

కొద్దిరోజులకే పగుళ్లు

ప్రయాణికులకు తప్పనిపాట్లు

కంభం, అక్టోబరు 7 : కంభం, కందులాపురం మేజర్‌ పంచాయతీల్లోని పలు ప్రధాన సిమెంట్‌ రోడ్లు  అధ్వానంగా ఉన్నాయి. నడిచేందుకు కూడా వీలుకాని స్థితిలో కొన్ని రోడ్లు ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కందులాపురంలోని 1, 2 వీధుల రోడ్లు, అర్బన్‌కాలనీ మీదుగా రైల్వేస్టేషన్‌ వరకు నిర్మించిన రోడ్లు, పైపులైన్ల కోసం అడ్డదిడ్డంగా రోడ్లను పగులగొట్టి అలాగే వదిలిలేశారు.  దీంతో ఎక్కువ భాగం రోడ్లు ధ్వంసమయ్యాయి. కంకర లేచి వాహనాలు వెళ్లే సమయంలో  టైర్ల కిందపడిన రాళ్లతో పాదచారులు గాయాల పాలవుతున్నారు. ద్విచక్ర వాహనాలు వెళ్లలేక చాలామంది గా యాలపాలయ్యారు. ఈ రోడ్లలో చాలా భాగం డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం నీరు రోడ్డుపై నిలబడుతూ గుంతలమయమై ఇబ్బందికరంగా మారింది. నెహ్రూనగర్‌లో 4వ వీధిలో సగం సిమెంట్‌ రోడ్డు, సగం మట్టిరోడ్డు. అర్బన్‌కాలనీ, కందులాపురం పంచాయతీలకు మధ్య కాలేజీ వెనుక రోడ్డు మొత్తం మట్టి రోడ్డుగానే ఉంది. వర్షం పడితే రోడ్డంతా బురదమయంగా మారిపోతుంది. ప్రజల ఇక్కట్లను గమనించి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు రూ.20 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు ముందుకు వచ్చి అధ్వానంగా ఉన్న రోడ్లను సిమెంట్‌ రోడ్లుగా నిర్మించారు. కొంతమంది అధికారుల బాధ్యతారాహిత్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఫలితంగా వేసిన కొన్ని నెలలకే కంకర లేవడం, రోడ్లు నిలువునా చీలుతున్నాయి. నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్‌ అధికారులు గానీ, సిబ్బంది లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది. నిర్మాణ సమయం లో పంచాయతీరాజ్‌ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించి నాణ్యత లోపం లేకుండా చూడాలి. ఇవేమి పట్టించుకోకుం డా కాంట్రాక్టర్లను వదిలివేయడం త ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం చేపట్టడంతో వేసిన కొన్ని నెలలకే నిలువునా చీలుతున్నాయి. 

తప్పించుకు తిరుగుతున్న 

పంచాయతీరాజ్‌ ఏఈ

మండలంలో పలుచోట్ల నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి నిర్మించిన సిమెంటు రోడ్లపై పంచాయతీరాజ్‌ ఏఈ వెంకటేశ్వరరావును ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. రోడ్లకు సంబంధించిన ఫైలు గిద్దలూరు ఆఫీసులో ఉందని, అక్కడికి ఎవరినైనా పంపిస్తే ఆ విషయమై చెపుతానని తెలిపారు. రెండు రోజుల నుంచి పీఆర్‌ ఏఈ వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు.


Updated Date - 2021-10-08T05:22:49+05:30 IST