బస్సులు నడవక.. ప్రయాణం సాగక..

ABN , First Publish Date - 2021-08-21T05:41:52+05:30 IST

మండల కేంద్రమైన దొనకొండకు మరికొన్ని గ్రామాలకు అనుసంధానంగా ఏడాదిన్నర క్రితం వరకు నడిచిన పొదిలి ఆర్టీసీ డిపో బస్సులు కరోనా వైరస్‌ కారణంగా నిలిచిపోయాయి.

బస్సులు నడవక.. ప్రయాణం సాగక..
రైల్వేస్టేషన్‌ వద్ద ఆటోలను ఆశ్రయిస్తున్న ప్రజలు

దొనకొండ, ఆగస్టు 20 : మండల కేంద్రమైన దొనకొండకు మరికొన్ని గ్రామాలకు అనుసంధానంగా ఏడాదిన్నర క్రితం  వరకు నడిచిన పొదిలి ఆర్టీసీ డిపో బస్సులు కరోనా వైరస్‌ కారణంగా నిలిచిపోయాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం  పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా ఉదృతి తగ్గడంతో ప్రస్తుతం రైల్వే అధికారులు నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు దొనకొండ రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్‌ ఇచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు, కాచిగూడ, గుంతకల్లు, నంద్యాల తదితర పట్టణ ప్రాంతాల నుండి రాకపోకలు ఒక మోస్తారుగా జరుగుతున్నాయి. రైలు దిగిన తర్వాత ప్రయాణికులు వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమైనప్పటికీ,  పరిమితికి మించి ఆటోలలో వారి ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో గ్రామాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆర్టీసీ అధికారులు రెండురోజులు బస్సు నడిపి కలెక్షన్‌ లేదనే కారణంతో బస్సును రద్దు చేయటం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి పల్లెకు పల్లెవెలుగు బస్సులు నడిపుతామని పాలకులు చెప్పే మాటలకు పొదిలి ఆర్టీసీ డిపో అధికారుల చేతలకు పొంతన లేకుండా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత ఆర్టీసీ అధికారులు ప్రజల రవాణా కష్టాలు గుర్తించి దొనకొండకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 

సిద్ధాయిపాలెం- వైపాలెం బస్సులు పునరుద్ధరించాలి

కరోనావైర్‌సకు ముందు దొనకొండ మీదుగా నడిచిన పొదిలి నుంచి సిద్ధాయిపాలెం, పొదిలి నుండి వైపాలెం బస్సులు పునరుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బస్సులు నడిపితే మండలంలోని తెల్లబాడు, ఆరవళ్లిపాడు, దొండపాడు, పెద్దన్నపాలెం, నరసింహనా యునిపాలెం, దొనకొండ, రుద్రసముద్రం, రామాపురం, మల్లంపేట, పుల్లాయిపల్లి, కట్టకిందపల్లి, కొచ్చెర్లకోట, బసిరెడ్డిపల్లి, సిద్దాయిపాలెం, నారపురెడ్డిపల్లి తదితర  గ్రామాల ప్రజలు పొదిలి, ఒంగోలు రాకపోకలు జరుపుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది.


Updated Date - 2021-08-21T05:41:52+05:30 IST