పేరుకే ఇద్దరు వైద్యలు

ABN , First Publish Date - 2021-05-19T07:49:14+05:30 IST

మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో లింగసముద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఓ ప్రధాన వైద్యాధికారి గత కొంత కాలం నుంచి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.

పేరుకే ఇద్దరు వైద్యలు
లింగసముద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

లింగసముద్రం, మే 18 : మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో లింగసముద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఓ ప్రధాన వైద్యాధికారి గత కొంత కాలం నుంచి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.బదీంతో  ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మరో వైద్యాధికారి డా.రమేష్‌ ఒక్కరే విధులు నిర్వహిస్తూ, సిబ్బందితో పని చేయిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గతంలో ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసి రోగులకు వైద్య సేవలు బాగా అందించేందుకు ఇద్దరు డాక్టర్లను నియమించింది. పేరుకే ఇద్దరు వైద్యాధికారులు అయినప్పటికీ  ఒక్కరే విధులకు హాజరతున్నారు. మరొక వైద్యాధికారి వైద్యశాలకు చుట్టపు చూపుగా వస్తున్నారు. దీంతో వైద్యశాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గత సెప్టెంబరులో సదరు వైద్యాధికారి నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై లింగసముద్రంకు  వచ్చారు. అప్పటినుంచి విధులకు సక్రమంగా రావడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు నెలల క్రితం కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఈ వైద్యాధికారి విధులకు సక్రమంగా హాజరు కాని విషయం గురించి డీఎంహెచ్‌వో డా.రత్నావళి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.ప్రియంవద దృష్టికి తీసుకెళ్ళారు. గత నెలలో  డా.రత్నావళి ఆరోగ్య కేద్రాన్ని సందర్శించి ఈ వైద్యాధికారి గురించి వాకబు చేయగా ఆయన సక్రమంగా విధులకు రారని, సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.ప్రియంవద కూడా ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారిని, సిబ్బందిని విచారించి ఆ వైద్యాధికారి సక్రమంగా రావడం లేదని నిర్ధారించి డీఎంహెచ్‌వోకు నివేదికను అందజేశారు. ఇంతవరకు సదరు వైద్యాధికారిపై  ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-19T07:49:14+05:30 IST