‘జడ్పీ’తో బంతాట!
ABN , First Publish Date - 2021-10-29T05:46:02+05:30 IST
జిల్లా పరిషత్ సీఈవో ఈ పోస్టు పరిషత్ పాలనలో అత్యంత కీలకం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ జిల్లావ్యాప్తంగా ఉన్న పరిషత్ యంత్రాంగంతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత ఆ పోస్టులో ఉన్న అధికారిపై ఉంటుంది. అయితే ఇంతటి కీలకమైన పోస్టు విషయంలో ప్రభుత్వం బంతాట ఆడుతోంది. 11నెలల వ్యవధిలో ఆరుసార్లు సీఈవోలను మార్చింది. ఇందులో ఒకసారైతే ఉత్తర్వులు ఇచ్చిన 24గంటల్లోనే వాటిని రద్దుచేస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇది జిల్లావ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. పనితీరు బాగోలేదని ఒకసారి సీఈవోను సరెండర్ చేస్తారు..

నెలకో సీఈవో...రోజుకో నిర్ణయం
11 నెలల వ్యవధిలో ఆరు సార్లు మార్పు
కీలకమైన హోదా విషయంలో నిలకడలేమి
సరైన కారణాలు చూపకుండా నిర్ణయాలు
తాజాగా డిప్యూటీ సీఈవోకి పూర్తి అదనపు బాధ్యతలు
ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 28: జిల్లా పరిషత్ సీఈవో ఈ పోస్టు పరిషత్ పాలనలో అత్యంత కీలకం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ జిల్లావ్యాప్తంగా ఉన్న పరిషత్ యంత్రాంగంతో సమర్థవంతంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత ఆ పోస్టులో ఉన్న అధికారిపై ఉంటుంది. అయితే ఇంతటి కీలకమైన పోస్టు విషయంలో ప్రభుత్వం బంతాట ఆడుతోంది. 11నెలల వ్యవధిలో ఆరుసార్లు సీఈవోలను మార్చింది. ఇందులో ఒకసారైతే ఉత్తర్వులు ఇచ్చిన 24గంటల్లోనే వాటిని రద్దుచేస్తూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇది జిల్లావ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. పనితీరు బాగోలేదని ఒకసారి సీఈవోను సరెండర్ చేస్తారు.. మళ్లీ తిరిగి అదే అధికారిని నెలవ్యవధిలోనే అదే పోస్టులో కూర్చోబెడతారు. అదేమని అడిగేవాళ్లు లేరు...అడిగినా చెప్పేవాళ్లు లేరు. డిప్యుటేషన్ పేరు మీద పంచాయతీరాజ్ వ్యవస్థపై కనీస అవగాహన లేని వ్యక్తిని తెచ్చి సీఈవో బాధ్యతలు కట్టబెడతారు. నిబంధనల ప్రకారం డిప్యుటేషన్ విధానం సరైనదే కావొచ్చు కానీ అంతటి కీలకమైన పోస్టుకు స్థిరత్వం అవసరం. ఇవేమీ ప్రభుత్వానికి పట్టవు. తాము అనుకున్న వ్యక్తులను సీట్లో కూర్చొబెట్టడానికి గాని రోజుల వ్యవధిలో ఉత్తర్వులను రద్దుచేయడానికి గాని ఎలాంటి సంకోచాలు లేవు. అనుకున్నది జరిగిపోవాలంతే.
ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు
ఇక తాజాగా బుధవారం డిప్యూటీ సీఈవో జాలిరెడ్డికి సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన ఒంగోలు మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించడంతో పాటు డిప్యూటీ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సీఈవోగా అతిపెద్ద బాధ్యత. అంటే మూడో పోస్టు అన్నమాట. కీలకమైన పోస్టుకి అదనపు బాధ్యతలు. ఇది తాత్కాలికమైతే పర్వాలేదు. కానీ నెలల తరబడి ఇన్‌చార్జి బాధ్యతలు అంటే పాలన పడకేసినట్లే. సీఈవో పోస్టు విషయంలో ఈ దాగుడుమూతలు, నిలకడ లేని నిర్ణయాల వెనక స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పాలకవర్గం కూడా కొలువుదీరినందున ఇకపై విధిగా సమావేశాలతో పాటు, స్థాయీసంఘాల సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుని జిల్లాలోని గ్రామాలను అభివృద్ధి పథాన నడిపించాల్సిన అవసరముంది. ఇందులో జిల్లా పరిషత్ చైర్మన్‌తో పాటు సీఈవో పాత్ర ప్రముఖంగా ఉండనుంది. ఇకనైనా సీఈవో పోస్టు విషయంలో ప్రభుత్వం బంతాట ఆపి రెగ్యులర్ సీఈవో నియామకం చేపట్టి పాలనను పట్టాలెక్కించాల్సిన అవసరముంది.
11 నెలల వ్యవధిలో సీఈవో విషయంలో నిర్ణయాలు ఇలా..
డిసెంబరు 16,2020-సీఈవో కైలాస్‌గిరీశ్వర్‌ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
తర్వాత క్రమంలో జాయింట్ కలెక్టర్ చేతన్‌కు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జేసీకి పని ఒత్తిడి కారణంగా ఇన్‌చార్జి బాధ్యతలను పూల సుబ్బయ్య వెలగొండ ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ సరళావందనంకు వారంరోజుల పాటు అప్పగించారు.
జనవరి 27, 2021- సీఈవోగా కైలాస్‌గిరీశ్వర్ తిరిగి విధుల్లోకి వచ్చారు.
మే 21, 2021-సీఈవో కైలాస్‌గిరీశ్వర్‌ను ప్రభుత్వానికి రిపోర్టు చేయమని ఆదేశాలు. విద్యాశాఖకు చెందిన డి.దేవానందరెడ్డిని డిప్యుటేషన్‌పై సీఈవోగా నియమిస్తూ ఉత్వర్వులు.
మే 22,2021-దేవానందరెడ్డి నియామక ఉత్తర్వులు నిలిపివేత, యథావిధిగా కైలాస్ గిరీశ్వర్ కొనసాగింపు.
జూన్ 17,2021- దేవానందరెడ్డి నియామకంపై ఉన్న నిలుపుదల ఉత్తర్వులను ఎత్తివేస్తూ సీవోఓగా నియమిస్తూ ప్రభుత్వం మళ్లీ నిర్ణయం.
అక్టోబరు 26, 2021-సీఈవో దేవానందరెడ్డిని రిలీవ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు
అక్టోబరు 27, 2021-పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు దేవానందరెడ్డిని తన మాతృశాఖకు రిలీవ్ చేసే ప్రక్రియను పూర్తిచేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్. డిప్యూటీ సీఈవో జాలిరెడ్డికి సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు.
తాజా పరిస్థితి
ప్రస్తుత సీఈవో దేవానందరెడ్డి తిరిగి సొంత విద్యాశాఖకు వెళ్లిపోవడంతో సీఈవో పోస్టుకు పలువురు అధికారులు పోటీపడ్డారు. ప్రధానంగా డీపీవో నారాయణరెడ్డి, జడ్పీ ఏవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవో జాలిరెడ్డి తదితరులు ఉన్నారు. తొలుత వీరంతా మంత్రి బాలినేని సిఫార్సు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే జడ్పీ చైర్‌పర్సన్ సిఫార్సుకు అనుగుణంగా సీఈవోని నియమించాలని మంత్రి భావించి ఆ విషయాన్ని ప్రయత్నాలు చేస్తున్న వారికి చెప్పినట్లు తెలిసింది. తర్వాత వారంతా చైర్‌పర్సన్ వెంకాయమ్మ కుమారుడు మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి మద్దతు కోసం ప్రయత్నించారు. ఆయన కూడా కొన్ని సూచనలు అధికారులకు చేసినట్లు సమాచారం. దీంతో ఒకరిద్దరు ప్రయత్నాలు విరమించుకోగా, మరికొందరు ప్రయత్నాలు చేసినవారి జాబితాలో చేరారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో జాలిరెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రి నుంచి వచ్చిన సిఫార్సు మేరకు జాలిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేగాక జాలిరెడ్డినే సీఈవోగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిఫార్సు చేసినట్లు కూడా సమాచారం. తదనుగుణంగా జాలిరెడ్డినే సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావచ్చని తెలిసింది. దీంతో ఖాళీ అయ్యే డిప్యూటీ సీఈవో పోస్టు కోసం ఒకరిద్దరు అధికారులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం. అయితే ఈ బదిలీల బంతులాటకు ఇప్పటికైనా తెరదించుతారా, లేదనేది చూడాల్సి ఉంది.