బడికి రాని ‘బాల సురక్ష’

ABN , First Publish Date - 2021-12-31T04:50:47+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసింది. తెలిసీతెలియని వయస్సులో ఉన్న వారి శ్రేయస్సును పట్టించుకోవడం మానేసిం ది.

బడికి రాని ‘బాల సురక్ష’

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్యక్రమం అమలు

ప్రతి నెలా విద్యార్థుల వద్దకెళ్లి వైద్య పరీక్షలు

వైసీపీ వచ్చాక స్కూళ్లకు రాని వైద్య సంచార వాహనాలు 

అనారోగ్యం బారినపడుతున్నా గుర్తించలేని పిల్లలు

ఆందోళనలో తల్లిదండ్రులు

సేవలను పునరుద్ధరించాలని వేడుకోలు 


బేస్తవారపేట, డిసెంబరు 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణను రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసింది. తెలిసీతెలియని వయస్సులో ఉన్న వారి శ్రేయస్సును పట్టించుకోవడం మానేసిం ది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బాల సురక్ష పేరుతో బృహుత్తర కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మినీ వైద్య వాహనం గ్రామాల్లో ప్రభు త్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంది. అందులో భాగంగా జిల్లాకు 30 మినీ వైద్య వాహనాలను సిద్ధం చేసింది. ఆ వాహనంలో ఇద్దరు వైద్యులు, ఒక నర్సు ఉండేలా ఏర్పాటు చేశారు. 18 ఏళ్లలోపు బాలబాలికల్లో అనారోగ్య సమస్యలు గుర్తించి తక్షణ వైద్య సేవలందించేవారు. అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి రిఫర్‌ చేసేవారు. ఈ మొబైల్‌ వాహనం రోజూ ఒక పాఠశాలను ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించాలి. 


చిన్న వయస్సులోనే లోపాలు గుర్తిస్తే సరైన వైద్యం

చదువులో చురుగ్గా ఉండే కొందరు విద్యార్థుల్లో సైతం అనారోగ్య సమస్యలు అంతర్గతంగా గూడుకట్టుకుని ఉంటున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరిగి బాధించడం ప్రారంభిస్తాయి. అలాంటప్పుడు బాల్య దశలోనే రోగాలను గుర్తించి వాటికి శాశ్వత వైద్య పరిష్కారం చూపించినట్లయితే భవిష్యత్‌లో ఆరోగ్యవంతులుగా ఎదిగి ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే బాలసురక్ష ద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కల్పించే వారు. 


రెండేళ్ల నుంచి జాడ లేదంటున్న తల్లిదండ్రులు

తొలిసారిగా కరోనా వచ్చిన తర్వాత బాలసురక్ష సేవలను నిలిపివేశారు. రెండేళ్లుగా ఆ వాహనాల జాడ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద విద్యార్థులకు బాలసురక్ష పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేవని అంటున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటూ తమ పిల్లలను వసతిగృహాల్లో ఉంచి చదివిస్తున్నామని, వారు ఎలా ఉంటున్నారో.. వారి ఆరోగ్య సమస్యలు ఏంటో తమకు తెలియవని.. ఇలాంటి పరిస్థితుల్లో బాలసురక్ష ద్వారా బడిలో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయడంతోపాటు బాగులేకపోతే ఆసుపత్రికి తరలించి వారు కోలుకునే వరకూ మెరుగైన వైద్యం అందించేవారని పేద విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలసురక్ష పథకానికి మంగళం పలికారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకోసారి బడికి వెళ్లి పిల్లలను పరీక్షించి వ్యాధులను గుర్తించి, వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించే వారని చెప్తున్నారు. ఇప్పుడు తమ పిల్లలకు ఏం జబ్బు చేసినా తామే వెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంచి కార్యక్రమమైన బాలసురక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. ఇప్పటికైనా బాలసురక్షను వెంటనే అమలులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 


నాటి కార్యక్రమం అమలు ఇలా...

పాఠశాలలకు బాలసురక్ష వాహనం వెళ్లి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసే క్రమంలో వ్యాధులున్నట్లు గుర్తించి వారి పేర్లను జాబితాలో పొందుపరుస్తారు. 

వారికి మెరుగైన వైద్యం అందించి వారు ఆరోగ్యవంతులుగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. 

మళ్లీ మూడు నెలల తరువాత అదే పాఠశాలకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

గతంలో మెరుగైన వైద్యం కోసం పంపించిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. కోలుకున్నాక వారి ఆరోగ్య నివేదికను  తయారు చేస్తారు. ఆ రిపోర్టును జిల్లా కేంద్రంలో పర్యవేక్షిస్తుంటారు. ఆ విధంగా విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ వహించేవారు. 

Updated Date - 2021-12-31T04:50:47+05:30 IST