అంతా నువ్వే చేశావ్‌!

ABN , First Publish Date - 2021-01-13T06:40:10+05:30 IST

అంతా నువ్వే చేశావు.. అర్హత కలిగిన పేర్లను తుదిజాబితా నుంచి తొలిగించేలా చేశావని ఇళ్ల పట్టాల పంపిణీ సభలో స్థానిక వైసీపీ కీలకనేతపై బాధిత మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు.

అంతా నువ్వే చేశావ్‌!
వైసీపీ నాయకుడిని నిలదీస్తున్న మహిళలు

వైసీపీ కీలక నేతపై ఆగ్రహించిన మహిళలు

రసాభాసగా మారిన ఉలవపాడులో ఇళ్ల పట్టాల పంపిణీ

వాయిదావేసిన తహసీల్దారు.. కారును ముట్టడించిన లబ్ధిదారులు

ఉలవపాడు, జనవరి 12 : అంతా నువ్వే చేశావు.. అర్హత కలిగిన పేర్లను తుదిజాబితా నుంచి తొలిగించేలా చేశావని ఇళ్ల పట్టాల పంపిణీ సభలో స్థానిక వైసీపీ కీలకనేతపై బాధిత మహిళలు ఆక్రోశం వెళ్లగక్కారు. ఉలవపాడు పంచాయతీ పరిధిలోని కొల్లూరుపాడులో మంగళవారం ఏర్పాటు చేసిన ఇళ్లపట్టాల పంపిణీ రసాభాసగా జరిగింది.  కార్యక్రమానికి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యుడు రామాల సింగారెడ్డిపై ఉలవపాడు, కొల్లూరుపాడు గ్రామాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాల కోసం విచారణ చేపట్టి అర్హుల జాబితాలో వచ్చిన పేర్లు తొలగించడం మీకు తెలిసే జరిగిందని ఒక్కసారిగా వారంతా నాయకుడిపై తిరగబడ్డారు. దీంతో గుక్కతిప్పుకోలేక ఆయన మీ దగ్గరి నాయకుల వల్లే కొన్ని పేర్లు తొలగించామని, అర్హులకు రెండోవిడత పట్టాలు ఇచ్చేవిధంగా ఏర్పాటు చేస్తారని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు ఆందోళనను ఆపలేదు. చేసేదేమీ లేక ఆయన అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. రెండుగంటల పాటు తహసీల్దారు కె.సంజీవరావు బాధిత మహిళల మధ్య వాగ్వాదం జరిగింది.  మరోమారు విచారణ చేసి తమకు న్యాయం చేసేవరకు పట్టాల పంపిణీ జరగనీయబోమని మహిళలు భీష్మించుక్కూర్చున్నారు. విచారించి రెండో విడత పట్టాలు ఇస్తామని చెప్పినా వెనక్కు తగ్గలేదు. ఎంపీడీవో శ్రీనివాసరావు మాటా వినలేదు. దీంతో తహసీల్దారు పట్టాల పంపిణీని వాయిదా వేసి తిరిగి వెళ్లేందుకు కారు వద్దకు వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాస్తున్న తమను కాదని ఎలా ముందుకు వెళతారని తహసీల్దారు కారుని పట్టాలకు ఎంపికైన లబ్ధిదారులు చుట్టుముట్టారు. ఎంత సర్దిచెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి రక్షణగా నిలిచి చివరికి 231మందికి పట్టాలు పంపిణీ చేశారు.

వలంటీర్లపై తహసీల్దారు ఆగ్రహం 

ఈ సమస్యంతా వలంటీర్ల వల్లే వచ్చిందని తహసీల్దారు సంజీవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తొలుత అర్హులంటు జాబితా తయారు చేసింది మీరే.. చివరికి అర్హులుకారంటూ నిలిపేసింది మీరే’ అంటూ మండిపడ్డారు. బంధుప్రీతి, స్థానిక కక్షసాధింపు కారణాలతో కొందరు అర్హత ఉన్న పేదలను నాయకుల మాటలు విని జాబితాల నుంచి తొలగించారన్నారు. 


Updated Date - 2021-01-13T06:40:10+05:30 IST