మరో ఆత్మగౌరవ సామాజిక ఉద్యమం

ABN , First Publish Date - 2021-10-30T04:38:00+05:30 IST

ప్రకాశం జిల్లా టంగుటూరు వేదికగా పిచ్చిగుంట్ల (రాష్ట్ర కుంటిమల్లారెడ్డి) ఆత్మగౌరవ సామాజిక ఉద్యమం ప్రారంభంకానుంది.

మరో ఆత్మగౌరవ సామాజిక ఉద్యమం

వచ్చే నెల 7న పిచ్చిగుంట్ల, వంశ రాజ్‌ల రాష్ట్ర వ్యాప్త సమావేశం

టంగుటూరు వేదికగా పూరించనున్న శంఖారావం


టంగుటూరు, అక్టోబరు 29 : ప్రకాశం జిల్లా టంగుటూరు వేదికగా పిచ్చిగుంట్ల (రాష్ట్ర కుంటిమల్లారెడ్డి) ఆత్మగౌరవ సామాజిక ఉద్యమం ప్రారంభంకానుంది. ఇందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పిచ్చిగుంట్ల సామాజికవర్గ సమీకరణ కొనసాగుతోంది. వచ్చేనెల 7న జరిగే పిచ్చిగుంట్ల, వంశరాజ్‌ రాష్ట్ర నాయకుల సమావేశంతో ఉద్యమానికి శంఖారావం పూరించనున్నారు. రెడ్ల వంశీయులై ఉండి కూడా ఇతర రెడ్లకు కులగోత్రాలు, ఆచార వ్యవహారాలు చెప్పి జీవనం సాగించేవారిగా మారిపోయారు. ఇదే జాతి క్రమంగా పాత వైభవాన్ని కోల్పోయి సంచార జాతిగా మారింది. 


ఆత్మగౌరవానికి అడ్డంకిగా...

పిచ్చిగుంట్ల అనే పదం ఆసామాజిక వర్గ్గీయులకు ఆత్మగౌరవ సమస్య తెచ్చిపెట్టింది. ఆ పదం తొలగించాలని అప్పట్లో వారి నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతీయులంతా పిచ్చిగుంట్ల స్థానంలో వంశరాజ్‌ పెట్టాలని కోరగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు తమ కులదైవమైన కుంటిమల్లారెడ్డి పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో ప్ర భుత్వం వద్ద ఉన్న పలుకుబడితో తెలంగాణ వారి ఇష్టానికి తగినట్లు గా వంశరాజ్‌ అనే పేరును అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో ఆంధ్రా ప్రాంతం వారిని సంతృప్తిపరిచేందుకని ప్రభుత్వం వారు వంశరాజ్‌ పేరుకు తొలగించిన పిచ్చిగుంట్ల పేరును కూడా జతచేశారు. నవ్యాంధ్ర అవతరణతో మళ్లీ వీరి సమస్య తెరమీదకొచ్చింది. ఆ రోజు తెలంగాణ వారి కోరిక మేరకు ఏర్పాటు చేసిన వంశరాజ్‌ ఉంచుతూనే పిచ్చిగుంట్ల స్థానంలో తమ కులదైవం మల్లారెడ్డి పేరు జత చేయాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. 


రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం

టంగుటూరు మాజీ సర్పంచ్‌ పుట్టా వెంకట్రావు న్యాయకత్వంలో ఏపీ కుంటి మల్లారెడ్డి, వంశరాజ్‌ సంక్షేమ సంఘం వచ్చేనెల 7న టం గుటూరులో రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భం గా వారి సామాజికవర్గ జనగణన సేకరణ సమాచారం పత్రం నమూనా విడుదల చేయనున్నారు. డిమాండ్లపై చర్చిస్తారు. ముం దుగా ప్రకాశం జిల్లా సంఘం నూతన కమిటీ ఎంపిక జరగనుందని ఇప్పటికే రాష్ట్ర ఎంబీసీ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్న పుట్టా వెంకట్రావు ప్రకటించారు. రాష్ట్రంలో తాము సుమారు రెండు లక్షల జనా భా ఉన్నప్పటికీ ప్రభుత్వం వద్దనున్న ప్రస్తుత సమాచారం ప్రకారం తమ జనాభా కేవలం 23వేలేనని, అందుకే కులగణన జరపాలని డిమాండ్‌ చేశారు. సంచారజాతులుగా మారి సరైన జీవనోపాధి లేక నిరుపేదలుగా మిగిలిన తమను ఎంబీసీ కులాల జాబితాల్లోనే కొనసాగిస్తూ, అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లకు ఎలాంటి అవరోధం కల్పించకుండా పిచ్చిగుంట్ల స్థానంలో తమ కుల దైవం కుంటి మల్లారెడ్డి పేరును చేర్చాలని కోరారు.

Updated Date - 2021-10-30T04:38:00+05:30 IST