రిమ్స్‌లో అందుబాటులోకి మరో 100 ఐసీయూ బెడ్లు

ABN , First Publish Date - 2021-09-02T06:47:28+05:30 IST

ఒంగోలు రిమ్స్‌లో మరో వంద ఐసీయూ బెడ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

రిమ్స్‌లో అందుబాటులోకి మరో 100 ఐసీయూ బెడ్లు
రిమ్స్‌ ఐసీయూలో ఏర్పాటు చేసిన బెడ్లు

నేడు ప్రారంభించనున్న మంత్రి 

ఒంగోలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):  ఒంగోలు రిమ్స్‌లో మరో వంద ఐసీయూ బెడ్‌లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు రూ.5కోట్ల వ్యయంతో రిమ్స్‌ పైఫ్లోర్‌లో భవన నిర్మాణంతోపాటు అన్ని వసతులతో ఏర్పాటు చేసిన వీటిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించగలిగిన పెద్దస్థాయి ప్రభుత్వ వైద్యశాల రిమ్స్‌ కాగా ఇక్కడ 500 బెడ్ల సౌకర్యం మాత్రమే ఉంది. కరోనా తీవ్రత నేపథ్యంలో రిమ్స్‌కు బాధితులు పెద్దఎత్తున వస్తుండటంతో పెరిగిన ఒత్తిడికి అనుగుణంగా బెడ్‌ల సంఖ్యను 1,500 వరకు పెంచారు. అందులో 158 ఐసీయూ బెడ్లు ఉండగా వాటి అవసరం ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా అనంతరం కూడా రిమ్స్‌లో ఉపకరించేలా 100 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.  వీటిని గురువారం మంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో జేసీ కృష్ణవేణి, రిమ్స్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల ఈఈ కె.రవి బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో దాతలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో రిమ్స్‌ ఆవరణలో చేపట్టిన మరో వంద బెడ్ల తాత్కాలిక భవన నిర్మాణం కూడా ఈ నెలాఖరుకు పూర్తికానుందని ఈఈ రవికుమార్‌ తెలిపారు.



Updated Date - 2021-09-02T06:47:28+05:30 IST