అభివృద్ధికి నోచని అక్కచెరువు

ABN , First Publish Date - 2021-09-04T05:21:22+05:30 IST

పొదిలి మండలంలోని అక్కచెరువు పంచాయతీని సమస్యలు వీడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ తలరాతలు మారడం లేదని గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధికి నోచని అక్కచెరువు
నిత్యం నీళ్ల మోత తప్పదు, రూ.35 లక్షలతో నిర్మించి వదిలేసిన నీటి పథకంలోని కుళాయి

సమస్యలతో కునారిల్లుతున్న గ్రామం

తాగునీటికి కటకట.. రహదారులు అధ్వానం

మురుగుతో దుర్గంధం.. పట్టించుకునే నాథుడే లేరంటున్న ప్రజలు


పొదిలి రూరల్‌, సెప్టెంబరు 3 : మండలంలోని అక్కచెరువు పంచాయతీని సమస్యలు వీడటం లేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ తలరాతలు మారడం లేదని గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కచెరువు  గ్రామానికి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నీటి సరఫరాకు పెద్ద పెద్ద పైపులైన్లు వేశారు. కాంట్రాక్టరు స్వార్థంతో ప్లాస్టిక్‌ పైపులు వేయడంతో అవి ఎక్కడికక్కడ పగిలిపోయి నీటిసరఫరాకు ఆదిలోనే అంతరాయం కలిగింది.  దశాబ్దాలుగా గ్రామంలో కనీస వసతులైన రహదారులు, మంచినీటి వసతి, మురుగునీటి కాలువల నిర్మాణానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాటి కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఈ గ్రామానికి పైపులైన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత అవి నిరుపయోగంగా మారాయి.  ఇక గ్రామంలో ఉన్న 20 చేతి పంపుల మరమ్మతులకు గురైనా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు అంటున్నారు. గ్రామానికి కూతవేటు దూరంలో దర్శి-కనిగిరి ఎన్‌ఏపీ పైపులైన్‌ ఉన్నా గ్రామానికి నీటిసరఫరా లేకపోవడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. నిత్యం ట్యాంకర్లపై ఆధారపడి అవి ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు  చూస్తున్నారు. గ్రామంలో  మట్టిరోడ్లు గుంతల మయంగా మారాయి. ఇళ్లలో మురుగునీరు ఎటూ వెళ్లే పరిస్థితి లేక ఎక్కడ మురుగు నీరు అక్కడే నిల్వఉండి దుర్గంధం వెదజల్లుతోంది.  ఇప్పటికైనా అధికారులు, నాయకులు గ్రామంపై దృష్టిపెట్టి కనీస వసతులు కల్పించేందుకు సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


నీటి సమస్య తీవ్రంగా ఉంది 

గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉన్న బోర్లన్నీ మరమ్మతులకు గురయ్యాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి ట్యాంకర్లను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 

-కాశిరెడ్డి, గ్రామస్థుడు


ప్రత్యామ్నాయం చూపించండి 

ఎస్సీపాలెంలో సుమారు 300 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కబోరు లేదు. ఒక్క కొళాయిలేదు. ఎస్సీపాలెం మొత్తానికి ఒక్క డిప్‌బోరు ఏర్పాటు చేశారు. అది కూడా గంటసేపు మోటార్‌ వేస్తే నీటి సరఫరా ఆగిపోతుంది. అధికారులు నీటి సమస్యకు పరిష్కారం చూపించాలి. 

- దేవసహాయం, గ్రామస్థుడు

Updated Date - 2021-09-04T05:21:22+05:30 IST