మళ్లీ ‘స్థానిక’ షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-11-02T06:47:13+05:30 IST

జిల్లాలోని వివిధ కారణాలతో నిలిచిపోయిన పలు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

మళ్లీ ‘స్థానిక’ షెడ్యూల్‌

నిలిచిపోయిన చోట్ల ఎన్నికలు

దర్శి నగరపంచాయతీతోపాటు 

నాలుగు సర్పంచ్‌, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు నిర్వహణ

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

14 నుంచి 16 వరకు పోలింగ్‌

18 వరకూ ఓట్ల లెక్కింపు

ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ కారణాలతో నిలిచిపోయిన పలు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వాటి నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని సోమవారం షెడ్యూల్‌ ప్రకటించారు. ఆప్రకారం జిల్లాలో ఒక నగర పంచాయతీతోపాటు మరో నగర పంచాయతీ కౌన్సిలర్‌, తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు, నాలుగు సర్పంచ్‌లు, 46 వార్డుసభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 3 నుంచి 5 వరకు  నామినేషన్లు స్వీకరించనున్నారు. 14 నుంచి 16 వరకు ఒక్కో స్థాయి స్థానిక సంస్థ ఎన్నిక ఒక్కో రోజు జరగనుంది. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మూడు మునిసిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలు ఉన్నాయి. గత మార్చిలో ఎన్నికలు జరిగినప్పుడు దర్శి, పొదిలి, కందుకూరుల్లో ఎన్నికలు జరగలేదు. అందులో దర్శి, అలాగే అద్దంకిలో ఎన్నిక నిలిచిపోయిన 8వవార్డు కౌన్సిలర్‌ పదవికి కూడా ప్రస్తుతం ఎన్నిక జరగనుంది. మరోవైపు గత ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్లు అనంతరం గుర్తింపుపొందిన పార్టీల అభ్యర్థుల మృతి, అలాగే ఎన్నిక అనంతరం గెలుపొందిన వారి మృతి కారణంగా తొమ్మిది ఖాళీలు వచ్చాయి. వాటిలో చదలవాడ, లేళ్ళపల్లి, తంగిరాలపల్లి, తిమ్మపాలెం, పోలూరు, కారంచేడు-3, చెరుకూరు(పశ్చిమ), మరుగమ్మి, ఉప్పుమాగులూరు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే గతంలో ఎన్నికలు నిలిచిన బింగినపల్లి, నరిశెట్టివారిపాలెం, పోతవరం, చోడవరం పంచాయతీల సర్పంచ్‌తోపాటు 40 పంచాయతీల్లోని 46 వార్డుసభ్యుల ఎన్నికలు కూడా జరగనున్నాయి. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఈనెల 5 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 14 నుంచి 16 వరకు పోలింగ్‌ జరగుతుంది. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించడంతో నిర్వహణపై జిల్లాలోని సంబంధిత అధికారులు దృష్టిపెట్టారు. రిటర్నింగ్‌ అధికారుల నియామకం, నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను చేపట్టారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే కోడ్‌ అమలులో ఉంటుంది. 




Updated Date - 2021-11-02T06:47:13+05:30 IST